న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయగా 27 పార్టీల నుంచి 37 మంది నేతలు హాజరైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ అఖిలపక్ష భేటీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్ సింగ్, ఆర్జెడీ తరఫున మనోజ్ ఝా, డిఎంకె, వామపక్ష నేతలు అదానీ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా వెనుకబడిన కులాల వారున్నారని , కులగణనతో వారి ఆర్థికస్థితి తెలుస్తుందని అభిప్రాయపడింది. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్‌సాయి రెడ్డి ఈ డిమాండ్‌ను ముందుంచారు. దీనికి ఆర్జెడీ, జెడి(యు)కూడా మద్దతు పలికాయి. రెడ్డి ఇంకా మహిళా కోటా బిల్లుపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేయగా, దానికి టిఆర్‌ఎస్, టిఎంసి, బిజెడి మద్దతు పలికాయి.
బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరుగనున్నాయి. 27 సిట్టింగ్స్ ఉండనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.