అభ్యర్థులు అధికం.. జంబో బ్యాలెట్ పేపర్
రికార్డు స్థాయిలో పోలింగ్
నాలుగు రోజులుగా సుధీర్ఘంగా కొనసాగుతున్న కౌంటింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నీ రికార్డులే చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం ఒక రికార్డయితే…ఓటర్లు సైతం అదే స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనడం మరో రికార్డు. నియోజకవర్గాలలో బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో దినపత్రిక పరిమాణంలో జంబో బ్యాలెట్ పత్రం ఉండటమూ ఓ రికార్డు.
దాంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుధీర్ఘంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, గట్టి పోటీనిచ్చే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో రసవత్తర పోరు కొనసాగింది. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని రికార్డులే నమోదు కావడంతో ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజూ మూడు షిఫ్టుల్లో ఓట్లను కౌంటింగ్ చేపడుతున్నారు. ఇందుకోసం అదనపు సిబ్బంది, అదనపు రిటర్నింగ్ అధికారులు నియమించుకున్నారు. గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరగడంతో కౌంటింగ్‌కు చాలా సమయం పడుతోంది. బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నాలుగు రోజులుగా సుధీర్ఘంగా కొనసాగుతోంది.
రెండవ.. మూడవ ప్రాధాన్యత లెక్కింపు ఓ రికార్డే
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా (చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మూడవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికీ ఫలితం తేలకపోతే కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే విజేత ఎవరో తెలిసిపోగా, ఈసారి మాత్రం రెండవ, మూడవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించవలసి రావడమూ ఓ రికార్డే.