సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్లేఆఫ్స్ పోటీలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పన్నెండు వారాల హోరాహోరీ పోటీ తర్వాత లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు సోమవారం నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రో కబడ్డీ లీగ్(పికెఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియం లో సోమవారం జరిగే రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లతో కబడ్డీ ఫీవర్ భాగ్యనగరాన్ని ఊపేయనుంది. పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దబాంగ్ ఢిల్లీ కెసి ఎలిమినేటర్-1 పోరులో ఆరో స్థానంలో ఉన్న పాట్నా పైరేట్స్‌తో తలపడుతుంది. ఎలిమినేటర్- 2లో నాలుగో స్థానంలోని గుజరాత్ జెయింట్స్ ఐదో స్థానం సాధించిన హర్యానా స్టీలర్స్ తో అమీ తుమీ తేల్చుకోనుంది.
ఈ నాలుగు జట్లు ఈ నెల 28, బుధవారం జరిగే సెమీ-ఫైనల్స్ లో చోటు నువ్వా,నేనా? అన్నట్టు తలపడునున్నాయి. లీగ్ దశలో సత్తా చాటి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టేబుల్ టాపర్ పుణెరి పల్టాన్, రెండో స్థానంలోని జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో చేరుకున్నాయి. ఎలిమినేటర్-1 విజేతతో పుణెరి సెమీస్‌లో పోటీ పడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ ఎలిమినేటర్-2లో నిలిచిన జట్టుతో తలపడుతుంది.
మార్చి1, శుక్రవారం మెగా ఫైనల్ జరుగుతుంది. ఈ సందర్భంగా లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ..ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరైన అనుపమ్ ఈ సీజన్ గురించి మాట్లాడారు. ‘పీకేఎల్ పదో సీజన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నాలుగేళ్ల తర్వాత మేం మళ్లీ 12 ఫ్రాంచైజీల సొంత నగరాల్లో తిరిగి మ్యాచ్‌లు నిర్వహించాం. అలాగే, మా లీగ్ మ్యాచ్‌ల ప్రసారం, ఓటీటీలో ప్రసారాలకు కూడా భారీగా ఆదరణ పెరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులకు చేరువయ్యాం. అదే విధంగా పీకేఎల్ పది సీజన్లు పూర్తి చేసుకోవడం గొప్ప విజయం. అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఇతర విధానాలను చేర్చడం ద్వారా లీగ్ ను మరింత పెద్దదిగా మార్చాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఈ పికెఎల్ పదో సీజన్ పోటీలో నాణ్యతతో పాటు ప్రేక్షకులు, వీక్షకులకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్ తమ జట్టు టైటిల్‌ని కాపాడుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశాడు.