Monday, December 23, 2024

సిఎం సభకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మునుగోడు ప్రచారంలో దూకుడు
పెంచిన టిఆర్‌ఎస్ నేడు
బంగారిగడ్డకు సిఎం కెసిఆర్

మన ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం లో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి సమ యం ఉంది నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్‌ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అందులో భాగంగా సిఎం కెసిఆర్ సభకు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చండూరు మండలం బంగారిగడ్డలో సభ కోసం విస్తృత ఏర్పాట్లు టిఆర్‌ఎస్ శ్రేణులు పూర్తి చేశారు.

సిఎం కెసిఆర్ సభకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేందుకు సిద్ధమవుతుండగా అందుకనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. గ్యాలరీల వారీగా బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. ఇక సభాస్థలికి నలువైపుల నుంచి ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లను సైతం పూర్తి చేస్తున్నారు. అందుకు అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సభా స్థలానికి కొద్ది దూరంలోని పార్కింగ్ ఏరియాల్లోనే వాహనాలను నిలిపి ప్రజలు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే నెల రోజులకు పైగా సాగుతున్న ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు విశేషమైన స్పందన వస్తుండటంతో. గ్రామగ్రామాన సబ్బండ వర్గాల ప్రజలు టిఆర్‌ఎస్‌కు జై కొడుతున్న విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపధ్యంలో నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్ సభకు కూడా వేలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపటిసి స్థానాల వారీగా పార్టీ ఇన్‌చార్జీలు సభకు విస్తృత ప్రచారం కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఆవాసం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ బహిరంగసభ ద్వారా మరోసారి బిజెపిపై కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించవచ్చు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు ఘటనకు చెందిన అంశాలను వేదికగా చేసుకుని నరేంద్రమోడీ, అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశముందని తెలుస్తోంది. బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం పెద్దలు సాగిస్తున్న ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టే అంశాన్ని కెసిఆర్ తేటతెల్లం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభ ద్వారా కెసిఆర్ తనదైన శైలిలో బిజెపి ప్రభుత్వాన్ని ఒక రేంజ్‌లో విరుచుకుపడడం తథ్యమని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News