హైదరాబాద్: నగరంలో గులాబీ ప్లీనరీ వేడుకకు సర్వం సిద్ధమైంది. అధికార పార్టీ టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని హెచ్ఐసిసి వేదికలో పార్టీ ప్లీనరీ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మూడు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆహ్వానాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలకు సంబంధించి.. రాష్ట్ర, జాతీయ అంశాలపై టిఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జెండా పండగ జరపాలని.. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ గులాబీమయంగా మారింది. 2021 ఏప్రిల్‌లో జరగాల్సిన ద్విదశాబ్ది ప్లీనరీ…కరోనా పరిస్థితుల వల్ల అక్టోబరు 25న నిర్వహించారు.ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి ప్లీనరీ నిర్వహిస్తున్నారు. సభ చుట్టూ ఎనిమిది పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఎల్ఈడీ స్క్రీన్‌తో కూడిన భారీ వేదికను ఏర్పాటు చేశారు.ఉద్యమం, పాలనపరమైన కీలక ఘట్టాలను స్క్రీన్ పై ప్రదర్శించనున్నారు. ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులు హెచ్ఐసీసీకి చేరుకోనున్నారు. 11 గంటల 5 నిమిషాలకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. వేదికపై అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం కానుంది. 21 ఏళ్ల ప్రస్థానంతోపాటు.. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగించనున్నారు.
All Set for TRS Plenary at HICC