తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం
తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్‌కు రైతు సంఘం నేతల వినతిపత్రం
వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆషామాషీ కాదు
మద్దతు ధరపై సిఎం కెసిఆర్ చిత్తశుద్ధిని చాటుకున్నారు
ఆయన రైతు సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్
చెన్నైలో దక్షిణ భారత రైతు నాయకుల భేటీ
తెలంగాణ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఒత్తిడి తేవాలని తీర్మానం
మనతెలంగాణ/ హైదరాబాద్: తమిళనాడులో రైతుబంధు, రైతు బీమా,వ్యవసాయ రంగంకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సౌత్ ఇండియా రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. శనివారం చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సౌత్ ఇండియా రైతు సంఘం నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని సిఎం స్టాలిన్‌కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ, సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన దృష్టికి తెచ్చారు.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమిళనాడులో అమలు చేసేందుకు పరిశీలిస్తాం అని సిఎం స్టాలిన్ వారికి హామీ ఇ చ్చారు. ఈ సందర్భంగా జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డు సాధన సమితి అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తు న్న తీరు అద్భుతం.
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. వానాకాలంలో 7000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదన్నారు. ఎంఎస్‌పి విషయంలో కేంద్రానికి లేఖ రాసి మరోమారు రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నాడు.అన్ని రాష్ట్రాలు ఎంఎస్‌పిపై కేంద్ర ప్రభు త్వం ను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ కో ఆర్డినేటర్ పిటి జాన్ (కేరళ) మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీ మా వంటి పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్. కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు శాంతా కుమార్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు పథకాలు అద్భుతం. రైతుల,వ్యవసాయ రంగంపై వివక్ష పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ మోడీకి లేఖ రాయడం అభినందనీయం. ఎమ్మెస్పీ,ఇతర రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆ రాష్ట్ర రైతులకు మేలు చేసేలా ఉన్నాయి. కార్యక్రమంలో పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.