Friday, November 22, 2024

‘టీమిండియా ఆశలన్నీ’ అఫ్గాన్‌పైనే

- Advertisement -
- Advertisement -

All Team India hopes are on Afghanistan

నేడు కివీస్‌తో కీలక పోరు. నబి సేన ఓడితే భారత్ ఇంటికే!

అబుదాబి: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అఫ్గాన్ గెలిస్తేనే టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే మాత్రం చివరి మ్యాచ్‌తో సంబంధం లేకుండానే టీమిండియా సెమీ ఫైనల్ రేసుకు దూరమవుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించడం అఫ్గాన్ అనుకున్నంత తేలికేం కాదు. అయితే సంచలన ఆటకు మరో పేరుగా చెప్పుకునే మహ్మద్ నబి సేనను తక్కువ అంచనా వేయలేం. రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబుర్ రహ్మాన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు అఫ్గాన్‌కు అందుబాటులో ఉన్నారు. అయితే బ్యాటింగ్‌లో బలహీనంగా ఉండడం అఫ్గాన్‌కు ప్రతికూలంగా మారింది.

నిలకడలేమి అసలు సమస్య..

ఇక ఈ వరల్డ్‌కప్‌లో అఫ్గాన్‌కు బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఓపెనర్ల హజ్రతుల్లా జజాయి, మహ్మద్ షాజాద్‌లు నిలకడగా ఆడలేక పోతున్నారు. ఒక మ్యాచ్‌లో ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. దీంతో అఫ్గాన్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించడం లేదు. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ షాజాద్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ జజాయి కూడా నిరాశ పరిచాడు. కీలక ఆటగాడు గుర్బాజ్, గుల్బదిన్ నైబ్‌లు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి బ్యాటింగ్‌లో నిలకడగా లోపించింది. ఇది జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న నజీబుల్లా జర్దాన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు.

కీలక ఆటగాళ్లందరూ ఫామ్ లేమీతో బాధపడుతుండడం అఫ్గాన్‌కు సమస్యగా తయారైంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా కెప్టెన్ మహ్మద్ నబిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. భారత్‌పై నబి ఒంటరి పోరాటం చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో అఫ్గాన్ జట్టులో నబి ఒక్కడే స్థిరంగా ఆడుతున్నాడు. కీలక ఆటగాడు రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. బౌలింగ్‌లో కూడా ఒకే మ్యాచ్‌లో రాణించాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఇక భారత్‌పై ధాటిగా ఆడిన కరీం జన్నత్‌పై అఫ్గాన్ భారీ ఆశలు పెట్టుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రషీద్ ఖాన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు.

ఫేవరెట్‌గా కేన్ సేన

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో కివీస్ జోరుమీదుంది. అఫ్గాన్‌పై కూడా గెలిచి సెమీస్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, డారిల్ మిఛెల్ జట్టుకు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో వీరిద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. అయితే కీలకమైన అఫ్గాన్ మ్యాచ్‌లో ఓపెనర్లు చెలరేగి ఆడక తప్పదు. గుప్టిల్ చెలరేగితే కివీస్‌కు భారీ స్కోరు ఖాయం. ఇక కెప్టెన్ విలియమ్సన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, నీషమ్, సాంట్నర్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నమీబియాపై ఫిలిప్స్, నీషమ్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కివీస్ పటిష్టంగా కనిపిస్తోంది.

ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, ఆడమ్ మిల్నె, ఐస్ సోధి, నీషమ్, మిఛెల్ సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కివీస్‌కు తిరుగే ఉండదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే గ్రూప్2 నుంచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. మరోవైపు అఫ్గాన్ గెలిస్తే మాత్రం టీమిండియాకు సెమీస్ చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అప్పుడూ భారత్‌నమీబియా జట్ల మధ్య సోమవారం జరిగే మ్యాచ్ కీలకంగా మారుతోంది. ఇక ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో స్కాట్లాండ్‌తో తలపడుతుంది. పాకిస్థాన్ ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇక స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనే పరాజయం చవిచూసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News