Thursday, January 23, 2025

విద్యుత్ వాడకంలో ఆల్ టైం రికార్డు

- Advertisement -
- Advertisement -
all time record in power consumption in telangana
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 13,742 మెగావాట్లుగా నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. శనివారం విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో 13,742 మెగావాట్స్‌గా నమోదయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను విద్యుత్ సంస్థలు అధిగమిస్తుండడంతో రానున్న రోజుల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. శనివారం మధ్యాహ్నం 2.57 నిమిషాలకు 13,742 మెగావాట్స్‌గా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం నమోదు కాగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక డిమాండ్ అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి 31వ తేదీన 13,688 మెగా వాట్స్ అత్యధిక డిమాండ్ నమోదు కాగా గత రికార్డులను తిరగరాస్తూ ఈసారి ఏకంగా 13,742 మెగా వాట్స్ డిమాండ్ నమోదు కావడం గమనార్హం.

గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం పెరగ్గా, గతేడాది గ్రేటర్ హైదరాబాద్‌లో 55 మిలియన్ యూనిట్స్ దాటని విద్యుత్ వినియోగం ఈసారి మార్చిలోనే 65 మిలియన్ యూనిట్స్‌గా నమోదయ్యిందని విద్యుత్ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం 14,500 మెగావాట్స్ విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉందని, 15,000ల మెగావాట్స్ డిమాండ్ వచ్చిన కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 04వ తేదీన 13,539 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో పాత రికార్డులను తిరగరాసిన విద్యుత్ శాఖ, శనివారం నమోదైన 13,742 మెగావాట్స్ విద్యుత్ డిమాండ్‌తో దూసుకుపోతోంది.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్

28న అందుబాటులోకి తీసుకురానున్న టిఎస్‌ఇఆర్‌సి

రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాలో సమస్యలు, ఇతర వాటిని పరిష్కరించడానికి వినియోగదారులు కన్జూమర్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం అవుతోందని వినియోగదారుల నుంచి ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ వినియోగ దారుల నుంచి మరింత సులభతరమైన పద్ధతిలో ఫిర్యాదులను స్వీకరించడానికి వెబ్, మొబైల్ ఆధారిత పోర్టల్‌ను అధికారులు అమల్లోకి తీసుకు రానున్నారు. ఈ నెల 28న రెడ్ హిల్స్ లోని సింగరేణి భవన్‌లో ఈ సరికొత్త పోర్టల్ ను ప్రారంభించనున్నట్టు తెలంగాణ స్టేట్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టిఎస్‌ఇఆర్‌సి) కార్యదర్శి డా. ఉమాకాంత పాండ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News