సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కెరిటాలు, రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన అమరవీరులకు సకల జనులు ఘనంగా నివాళ్లులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నాడు గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచెలు, ఉక్కు బూట్ల చప్పుళ్లను తాటాకులుగా భావించి ఆదరకుండా, బెదరకుండా ఉద్యమ కథనరంగంలో దూకిన ఉద్యమకారులు ధైర్య సాహసాలను, నాటి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవ సందర్భగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళ్లు అర్పించి శ్రద్దాంజలి ఘంటించారు. అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, జూల్లూరి గౌరీ శంకర్, టియుడబ్లూజె (టిజెఎఫ్) నాయకులు, బిఆర్‌ఎస్ కార్పోరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ శ్రేణులు అమర వీరులకు నివాళ్లు అర్పించారు. అనంతరం నగర బిఆర్‌స్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పార్టీ నేతలు గన్ పార్క్ నుంచి ట్యాంక్‌బండ్ అమర వీరుల సృతి వనం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అదేవిధంగా టియూడబ్లూజె ఆధ్వర్యంలో జర్నలిస్టులు గన్‌పార్క్ నుంచి అమర జ్యోతి వరకు ర్యాలీ నిర్వహించారు.