డిఎస్‌సికి నాలుగు నెలల సమయం ఇవ్వాలి : కోదండరాం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలో ప్రభుత్వం చెప్పిందని, అందులో 8 వేల పోస్టులే ఇప్పటివరకు భర్తీ చేశారని టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వాస్తవానికి ఇంకో 16 వేల ఖాళీలు ఉండాలని చెప్పారు. డిఎస్‌సి పోస్టులు పెంచాలని, పరీక్షకు 4 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో డిఈడి, బిఈడి నిరుద్యోగులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 5 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి, పోస్టులను సగానికి సగం తగ్గించి ఇప్పుడు 5080 ఉద్యోగాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన ఆరోపించారు. అందులో 1300 ఉర్దూ మీడియం పోస్టులని ఆయన తెలిపారు. మిగిలిన 3780 పోస్టులకే అప్లికేషన్‌లు లక్షల్లో వచ్చాయని అభ్యర్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా టీచర్ పోస్టులను పెంచాలని, లేదంటే తీవ్రమైన ఆందోళన చేస్తామని, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కోట్లడుతామని హెచ్చరించారు.
తొమ్మిదేళ్ల నుంచి చదివితే ఒక్క డిఎస్‌సి వేశారని, ఆరు నెలలకొకసారి నిర్వహించాల్సిన టెట్‌ను నిర్వహించడం లేదని అన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే గ్రూపు-1 మరోసారి రద్దు అయ్యిందని చెప్పారు. దీంతో అభ్యర్థులు మరోసారి అన్యాయనికి గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిపరేషన్‌కు ఎంత ఖర్చు పెట్టుకోవాలని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, నిరుద్యోగులందరిని ఎన్నికల్లో ఒక శక్తిగా మలుచుతామని కోదండరాం చెప్పారు.