Monday, February 10, 2025

తెలిసే భ్రమల్లో సాగే బతుకుల చిత్రణ ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనది కేన్ ఫిలిం ఫెస్టివల్. ఇటీవల మన భారతీయ సినిమా అక్కడ గ్రాండ్ ప్రి (Grand Prix) అవార్డు పొందింది. ’ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’
దర్శకురాలు పాయల్ కపాడియా ఈ అవార్డును పొందింది. ఇది ఓ అద్భుతం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నా మిత్రుడు షాజీ ఎన్ కరుణ్ ’ పిరవి ’ (1989) తర్వాత ఈ చిత్రానికి ఈ బహుమతి అందింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా మలయాళీ చిత్రాలే! అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందిన ఈ చిత్ర దర్శకురాలు పాయల్ కపాడియా అంతకుముందు తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’కి 2021లో ’గోల్డెన్ ఐ’బహుమతి కేన్ ఫిలిం ఫెస్టివల్ లో పొందింది. పాయల్ కపాడియా పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. దానికి 2015లో బిజెపి సభ్యుడు గజేంద్ర చౌహాన్‌ని కొత్త ఛైర్మెన్‌గా ప్రభుత్వం నియమించింది.

అంతకు ముందు ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కర్నాడ్, శ్యామ్ బెనెగల్ లాంటి ఉద్దండులు ఉన్న స్థానంలో ఇలాంటి వ్యక్తిని నియమించటాన్ని నిరసిస్తూ ఎఫ్.టి.ఐ.ఐ. విద్యార్థులు 139 రోజులు సమ్మె చేశారు. దానిలో క్రియాశీలకంగా పాల్గొన్న పాయల్ కపాడియా మీద కేసు నమోదు చేయడమే కాక, ఆమె స్కాలర్షిప్ ను రద్దు చేయడం లాంటివి చర్యలకు సైతం పాల్పడ్డారు. అయితే ఆమె తన ప్రతిభతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నప్పుడు ఆమెపై పెట్టిన కేసులు ఎత్తివేయడం పొగడ్తలు చేయడం మామూలే. ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ (మనం ఊహించే వెలుగు) అనే పేరు ఆమె తల్లి నళిని
మాలిని వేసిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ శీర్షిక. ఆ పేరునేతన చిత్రానికి పెట్టానని పాయల్ కపాడియా చెప్పింది.
అయితే ఈ చిత్రం ఏ మాత్రం అమూర్తం కాదు. చెప్పబడుతున్న అభివృద్ధి, కొనసాగించబడుతున్న మనిషి జీవనం మధ్య ఘర్షణను ఈ చిత్రం చెప్పింది.

ఈ చిత్రంలో వస్తువు చాలా సున్నితమైనది. మనం మోసానికి గురవుతామా? ఆ విషయం మనకు తెలియదా? మన ఇన్నాళ్లు సంపాదించిన, అనుభవంలోకి తెచ్చుకున్నవి, మన బుర్రలలో కుక్కుకున్నది జ్ఞానం కాదా? అది నిజానికి, అబద్దానికీ మధ్య ఉన్న తేడా గుర్తించలేదా? అబద్ధం రంగరించిన భ్రమ మనల్ని వాస్తవికతని మరిచేటట్టు చేస్తుందా? లేదు. మనకి అది అబద్ధమని తెలుసు. భ్రమని గుర్తించగలం. అయినా తెలిసిన భ్రమ’ (పర్సెప్టివ్ ఇల్యూజన్)లో మనం బతుకుతాం. మనకి తెలిసీ, ఆ భ్రమల్లోనే బతకడానికి కారణం ’యధాస్థితి మొగ్గు’ (స్టేటస్ కో బయాస్) మార్పు అంటే భయం. చీకట్లో ఉన్న మనకి వెలుగు (మార్పు) గురించి సరైన అవగాహన ఉండదు.

మిరమిట్లు కొలిపే, మనకందని అభివృద్ధి స్కై స్క్రైపర్లు, కార్లు, విమానాలు, ఫ్లైవోవర్లు, మాల్స్, మన కంటిన (మెటీరియల్ ఫిటిషిజం) వస్తు వ్యామోహం మనకు భ్రమాత్మక వెలుగునిస్తాయి. ఈ సినిమా మూడు పాత్రలతో పాటు ఇంకొక పాత్ర ముంబై నగరంది. కథలో కేంద్ర బిందువు ప్రభ. కేరళ నుండి వచ్చింది. ముంబైలోని ఓ హాస్పటల్లో నర్సుగా ఉద్యోగం. అంకిత భావం, నిజాయితీ ఆమె లక్షణాలు. ముఖాన నవ్వు ఉండదు. అలసట. చాలాసేపు ఇంటికి లోకల్ ట్రైన్‌లో ప్రయాణం. ఆమెకు పెళ్లయింది. భర్త పెళ్లయిన వెంటనే పని చేయడానికి జర్మనీ వెళ్ళాడు. అతను వెళ్లి సంవత్సరం పైబడింది. భర్త నుండి ఏ కబురు లేదు. అయినా ఏదో ఆశ అతను వస్తాడని.

తనలాగే కేరళ నుంచి వచ్చి, అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ వుంటుంది అను. యవ్వ న తొలిదశలో ఉంది. అనుకి తన ఇంటిని ఆమె షేర్ చేస్తుంది. అను ఒక ముస్లిం కుర్రాడు షియా జ్‌ని ప్రేమిస్తుంది. అది తన తల్లిదండ్రులకి ఇష్టం ఉండదని ఆమెకు తెలుసు. ముంబై నగరంలో స్వేచ్ఛగా ఉన్నట్లు పైకి కనిపించినా, శారీరకంగా కలవలేని స్థితి. చోటు లేదు. వీరిలాగే అదే హాస్పిటల్లో పార్వతి వంట చేస్తుంది. కొంకణి ప్రాంతం నుంచి వచ్చినామె. కాటన్ మిల్లు మూత పడగానే ఆమె భర్తకు ఒక క్వార్టర్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయాడు. ముంబైలో ఉండడానికి కనీసం ఆ ఇల్లయినా ఉండదేమో అన్న బాధపడుతున్న పార్వతిని ఒక హక్కుల లాయర్ దగ్గరికి తీసుకెళ్తుంది ప్రభ. అతను పేపర్లు లేని కారణంగా ఆ కేస్ నిలవలేదని చప్పరించేస్తాడు.

ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నా ముంబాయిలో ఇక ఉండగలమా అనే సంశయంలోనే అందరి బతుకులు వుంటాయి. ట్రాఫిక్, వర్షం, చాలీచాలని ఇల్లు, పెద్ద హోటళ్ళు, రుచికరమైన తిండి పదార్థాలు, వాటిలోకి అడుగుపెట్టలేని జీవితాలు. గణేష్ ఉత్సవాలు వస్తే, ఉద్రేకంతో డాన్సులు చేస్తూ తమని తాము మరిచిపోతారు. వీరందరూ మురికివాడల నుంచి వచ్చిన వాళ్లే. తాము ఉండేది ఒక ఇల్లు అని కూడా అనుకోలేని వాళ్లు వీళ్ళంతా. అయినా ముంబాయిని ‘స్వప్నాల నగరం’ అంటారు. కానీ నిజంగా అది ‘భ్రమల నగరం’. ‘నువ్వు మురికి కూపంలో ఉంటే నీకు కోపం రావడానికి వీల్లేదు. పైగా దాన్ని ‘ముంబాయి స్పిరిట్’ (భావోద్వేగం) అంటారు. దీనిని జనం నమ్ముతారు. నమ్మకపోతే చచ్చిపోతారు. ‘హృద్యమైన డాక్యుమెంటేషన్‌తో ఈ సినిమాలో చెప్తుంది దర్శకురాలు. ప్రభతో పాటు అదే హాస్పిట ల్లో పనిచేసే డాక్టర్‌కి ఆమె అంటే ఇష్టం. మలయా ళంలో కవిత్వం రాసి ఆమెకి ఇస్తాడు. ఆమె తనకి పెళ్లయిందని అతనికి దూరంగా ఉంటుంది.

పార్వతికి ఇల్లు దక్కలేదు. అయితే తన సొంత ఊరు రత్నగిరిలో హాస్టల్ ఉద్యోగం దొరికింది. ఆమెకు తోడుగా ప్రభా, అను ఇద్దరూ బయలుదేరుతారు. సముద్రతీరం. ప్రశాంతత. ఎప్పుడూఅలజడిని గుండెల్లో అదిమి పెట్టుకునే ప్రభకు ఊరట. అయి నా అను ఆమె ప్రవర్తనని అనుమానిస్తుంది. ఇకవెళ్ళిపోతానని ప్రభ అంటే ఆమెను అడ్డుకుంటుంది పార్వతి. ఇక్కడ మళ్లీ దర్శకురాలు ఫలితాంశ ప్రకటనలో తన ప్రతిభ కనపరుస్తుంది. సముద్రంలో మునిగిన వ్యక్తిని అక్కడి మనుషులు ఒడ్డుకు తెస్తా రు. నర్స్ అయిన ప్రభ సి.పి.ఆర్. ఇచ్చి అతడిని రక్షిస్తుంది. అది చూస్తున్న ఒక ఆమె ప్రభని అతని భార్య అనుకుంటుంది. ఇక్కడ సినిమాటిక్ ఇల్యూజన్‌అండ్ రియాల్టీ ప్రదర్శించబడుతుంది.

అతను ఆమె భర్త అయి క్షమాపణ కోరితే ఆమె నిరాకరిస్తుంది. ప్రభలో భ్రమల తెరలు తొలగాయి. శారీరక కలయికలో అను, షియాజ్ పొందే ఆనందాన్ని చూస్తుంది. తరువాత ప్రభ, అనుతో సియాజ్‌ను తీసుకొని రమ్మంటుంది. ఇద్దరు అక్వకడికి వస్తా రు. పార్వతి, ప్రభ, అను, షియాజ్‌లు ఎదురుగా ఉన్న సముద్రపు ఓపెన్నెస్‌ను ఆస్వాదిస్తుంటారు. ఇందులో ప్రభగా కని కస్రుటి నటన అద్భుతం. ఆ కళ్ళల్లో ఆశల్ని అణిచి వేసుకుంటూ, ఉదాసీనత ప్రకటించబడడం అపూర్వం. ఆమె అంతకుముం దు నటించిన కేరళ కఫేలో ఉత్తమ నటిగా స్టేట్ అవార్డు, అలానే ‘బిర్యాని’ చిత్రంలో మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డులు పొందింది. 2019 లో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపులకు నిరసనగా సినిమాల్లో నటించనంది. భ్రమాత్మక చిత్రాల మత్తులో ఊగే ప్రేక్షకుల్లా కాకుండా ప్రతిబింబాత్మక జీవన దృశ్యాలు చూసేవారికి ఈ చిత్రం ఒక విందు. అందుకు పాయల్ కపాడియా అభినందనీయురాలు.
సి.ఉమామహేశ్వరరావు
(సినీ దర్శకులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News