Monday, December 23, 2024

పెళ్లితో సంబంధం లేదు.. మహిళలందరికీ అబార్షన్ చేయించుకునే హక్కుంది..

- Advertisement -
- Advertisement -

All women have the right to have an abortion

గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ : మహిళల గర్భవిచ్ఛిత్తిలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా “వైవాహిక అత్యాచారాన్ని”కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. “ చట్ట ప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భవిచ్ఛిత్తి చేయించుకునే హక్కుంది. మహిళ వైవాహిక స్థితి కారణంగా ఆమెకు అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కులేదని చెప్పలేం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటిపి) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరం. రాజ్యాంగం ఎదుట అది నిలవజాలదు. పెళ్లయిన వారిని 24 వారాల లోపే అబార్షన్‌కు అనుమతిస్తూ, అవివాహితులను అనుమతించక పోవడం సరికాదు. ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి” అని కోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారం కూడా రేప్ వంటిదే….
విచారణ సందర్భంగా “వైవాహిక అత్యాచారాల” ను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. “అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక. చట్టపరమైన భాగస్వామి (భర్త) తోనూ లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయిక తోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చొచ్చు. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందే లెక్క. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది”అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంటీపీ చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోన్న‘ వైవాహిక అత్యాచార ’ కేసులో తీర్పులకు ఈ వ్యాఖ్యలు ఓ మార్గం చూపించే అవకాశం ఉంది. ఎంటీపీ చట్టం ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగ్గా అభివృద్ధి చెందిన ఘటనల్లో మహిళలు 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేయించుకునేందుకు అనుమతి ఉంది. అవివాహితులు తమ సమ్మతితో గర్భం దాలిస్తే .. అప్పుడు 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ చేయించుకునే వీలుంది. తాజా తీర్పుతో ఇప్పుడు పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ గర్భం దాల్చిన 24 వారాల లోపు గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News