టిజిఓ అధ్యక్షురాలు మమత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలందరూ తమ ఉద్యోగాల్లో విజయాలను సాధించాలని టిజిఓ అధ్యక్షురాలు మమత పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలంగాణ గెజిటెడ్ భవన్, నాంపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్‌మెంట్‌ల నుంచి విచ్చేసిన మహిళా గెజిటెడ్ అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. తరువాత మహిళా సాధికారితకు సంబంధించిన మహిళా సమస్యలపై చర్చతో పాటు మహిళల హక్కులను సాధించడానికి మహిళలు ఏ విధంగా స్పందించాలి, వారి పురోభివృద్ధికి ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ, సహకారాలపై పలువురు మహిళలు మాట్లాడారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడి సాధించాలని ప్రతి ఒక్క మహిళా ఒక శక్తిగా రూపాంతరం చెందాలన్నారు.
అదేవిధంగా మహిళలంతా చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను విధిగా ధరించాలని, ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని పెంపొందింప చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా గెజిటెడ్ అధికారిణులను టిజిఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ ఘనంగా సన్మానించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వి.సుజాత, పి.సబిత, విజయలక్ష్మి, స్వరూపారాణి, స్వర్ణలత, శీరిష, శ్రీలత, పద్మావతి, రేవతి, అమరావతి, జ్యోతి, అలివేలు, రవీందర్‌రావు, వెంకటయ్య,, ఎంబి కృష్ణయాదవ్, లక్ష్మణ్‌గౌడ్, పరమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.