సాహిత్యం అనేది చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, అంశాలతో మిళితమై భాష భావుకతతో చెప్పబడినది. పదునైన అక్షరాలతో, లోతైన అర్థాలతో, చెప్పబడిన శిల్ప సౌందర్యం సాహిత్యం. నాటి వేదా కాలము నుండి నేటి సాంకేతిక యుగం వరకు ఈ ప్రపంచం మానవ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులు. అది జ్ఞానమైన, ఆత్మజ్ఞానమైన, విద్యా విజ్ఞానమైన, యుద్ధమైన, విప్లవమైన, ఏ సామాజిక పరిణామమైన. పద్యం, గద్యం, పాట, నవల, నాటకం, కథా, కవిత, వ్యాసంగాలతో రూపుదిద్దబడినది. దీనికి నిదర్శనం డాక్టర్ మహమ్మద్ హసేన్ రచించిన సామాజిక సాహితి విశ్లేషణతో రూపుదిద్దబడిన సాహిత్య విమర్శ వ్యాసాల సమూహరం ‘తదేక‘ ఈ సాహితీ విమర్శలో ఇది ఉంది ఇది లేదు అనే సందేహం లేకుండా సాధ్యమైనా అంతవరకు పాఠకుడికి కావలసిన విధంగా సాహిత్యాన్ని కాచి వడపోసి అత్యంత విలువైన భలమైన సాహిత్యాన్ని అందించారు డాక్టర్ హాసేన్. ఒ
కవైపు తెలుగు సాహిత్యంలో మైనార్టీ స్త్రీవాద జీవన చిత్రణ, మరొకవైపు దళిత మైనార్టీ స్త్రీవాద సాహిత్యం తులనాత్మక పరిశీలన, ఇంకొక వైపు తెలుగు సాహితీ కవిత గుబాలింపుల పాటల ప్రవాహాలతో తెలుగు సాహితీ వరవడిని సృష్టించారు హసేన్. ఒక తండ్రి కన్నీళ్లు భయాలు బయటికి కనిపించవు. అతను ప్రేమను బయటికి ప్రకటించడు. అతను ఇచ్చే మనోధైర్యమే మన జీవితాలను తీర్చిదిద్దుతాయి. ‘ఏమైనా నాన్న మాటలకందని పదం) నాన్న లేకుంటే అంతా ఉత్తదే/ నా ప్రతి అడుగులో ఆయన పాదముద్రలే‘ఎంత పాడిన ఒడవని గీతం అని తెలంగాణ ఉద్యమ గొంతుక అంబటి వెంకన్న కలం నుండి నాన్నపై కవిత ప్రేమ అక్షర ప్రవాహం ఆలోచింప చేస్తుంది.పెన్నును ‘గన్ను‘గా అక్షరాన్ని ‘అస్త్రంగా‘ లేదా ‘ఆయుధంగా‘ కూడా వాడతారు సాహితీవేత్తలు. అక్షరాలను ఆత్మగా చేసుకుని బ్రతికిన వాళ్ళు కొందరు. అక్షరాన్ని ఆత్మగా ఆవాహన చేసుకుని మనసుని మదించిన వారు మరికొందరు. ‘ఇప్పుడొక పలక దొరికితే బాగుండు/చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు/చాలా గుర్తుకొస్తున్నాయి ‘బాల్యపు జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. తీరిక లేకుండా జీవితపు పోరాటం చేస్తే నాకు అలానే అనిపిస్తుంది.
కొత్త పలక దొరికితే బాగుండునని హసేన్ తన బాల్య జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. అలిశెట్టి స్వరం కవితా భాస్వరం బ్రతికింది కొద్ది కాలమే అయిన బలమైన సాహితి ముద్రవేశారు. సమాజంలోని అవినీతి అక్రమాలను అదరక, చెదరక, బెదరక, కళాని ముందుకు నడిపి కవిత సేద్యం చేసిన కవికర్షకుడు అలిశెట్టి ప్రభాకర్. ఒక నక్క/ప్రమాణ స్వీకారం చేసిందంట/ఇంకెవర్ని మోసగించనని/ఒక పులి/పశ్చాతాపం ప్రకటించిందట/తోటి జంతువుల్ని సంహరించినందుకు/ఈ కట్టు కథ విని/గొర్రెలింకా/పుర్రెలుపుతూనే ఉన్నాయ్/అంటు నాటి నేటి రాజకీయ నాయకుల వర్తించే అక్షర సత్యాలను తన కవిత్వంతో ఆజ్యం పోసిన అలిశెట్టి ప్రభాకర్ జీవితంపై హసేన్ సాహితీ విమర్శ ద్వితీయ.
తెలుగు సినిమా పూతోటలో పాటల సిరివెన్నెలను కురిపించిన కవి. తాత్వికత, తార్కికత, భావకత, ఆవేదన ఆద్రతతో అచ్చమైన, స్వచ్ఛమైన, సాహితి సోబగులతో సృజనాత్మక పాటలు రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహితీ ప్రస్థానం. ఎప్పుడు ఒప్పుకోక వద్దురా ఓటమి…/ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి/విశ్రమించవద్దు ఏ క్షణం…./విస్మరించవద్దు నిర్ణయం. అంటు నిరాశ, నిస్పహల, మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ‘ఆత్మవిశ్వాసం‘ కలిగించే ఎన్నో పాటలను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రికి అక్షర సిరాను ధారపోశారు హసేన్.
నూరు సంవత్సరాలలో సాంఘికంగా, రాజకీయంగా, కవిత్వాపరంగా, ఆంధ్రప్రదేశంలో అనేక ఉద్యమాలు తలెత్తాయి. జాతీయోద్యమం, భావకవితోద్యమం, అభ్యుదయ, దిగాంబర, విప్లవ, ఉద్యమాలు. స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీ వాద ఉద్యమాలు కూడా చరిత్రకు మరో మార్గం చూపాయి. షాజహాన్ అనే ముస్లిం కవయిత్రి ముస్లిమ్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఊహ తెలియని వయస్సులో/గుమ్మానికి పరదా కడితే/రంగురంగుల కుచ్చులు చూసి మురిసిపోయే దాన్ని/అప్పుడే స్వేచ్ఛకి మొదటి బేడి అని/తెలుసుకోలేని పసి దాన్ని…/ గుమ్మానికి కట్టినట్టే అమ్మ ముఖానికి బురఖా కడితే/స్వప్నం లాంటి జిందగీ కి శాపమని అప్పట్లో తెలియని దాన్ని/ఇలా ముస్లిం స్త్రీల జీవితం పదాల మాటున నలిగిపోవడాన్ని నిరసిస్తూ మీరు బిగించిన ఇనుప సంకెళ్లని విదిలిచ్చి వేయగల గుండె ధైర్యం చాలా ఉందం టూ కవయిత్రి షాజహాన్ తో మిగిలిన ముస్లింవాద కవుల రచన విశ్లేషనను తెలుగు సాహితీ మైనారిటీ స్త్రీవాద జీవన చిత్రణ చేశారు డాక్టర్ హసేన్.
మన సంస్కృతిలో మన దేశ అభివృద్ధిలో బంజారాల పాత్ర చరిత్ర మరవదు గిరిజన తండాలలో నేడు పాశ్చాత్య సంస్కృతి ప్రవేశించడంతో విషనాగు కోరల్లో చిక్కుకొని విలువలాడుతున్నాయి. బాయీ!/ ముంబై గాలి తన్నుకుపోయిందా/అడవి పుష్పమా! నా బంజారా భాష్పమా!!/ లంబాడి ఆడపిల్ల/చంప్లి/చంపకండిరా/అది రేపటి ఛాంపియన్/ఆడపిల్లలను అమ్ముకునే దుస్థితిని నేటికీ గిరిజన ప్రాంతాల్లో చూస్తూనే ఉన్నాం. అలానే గర్భంలో ఉన్నప్పుడో, పుట్టిన తర్వాతనొ, ఆడపిల్లలను చంపటం గిరిజనుల అమాయకత్వానికి నిదర్శనం. ఆడపిల్లల్ని చంపకండి అదే ఆడపిల్ల రేపటి ఒలంపిక్ ఛాంపియన్ కావచ్చు అని డాక్టర్ హసేన్ విశ్లేషణ ఆలోచింప చేస్తుంది.రణరంగం కాని చోటు/భూస్థలమంత వెతికిన దొరకదు/గతమంతా తడిసే రక్తమున/కాకుంటే కన్నీళ్ళతో/ఇతిహాసపు చీకటి కోణం/ అట్టడుగున పడి కనిపించని/ కథలన్నీ కావాలిప్పుడు/ దాచేస్తే దాగని సత్యం/మహాప్రస్థానం ఈ కావ్యంలో దేశ చరిత్రలు శీర్షికతో ఈ కవితను శ్రీశ్రీ చారిత్రక దృక్పథాన్ని తెలియజేశారు.
1972లో ఓల్గా ప్రతి స్త్రీ ఒక నిర్మలా కావాలి అంటూ స్త్రీవాద కవిత్వానికి బీజం వేశారు. అందమైన దోపిడీకి/పవిత్రమైన హింసకు/న్యాయమైన దాస్యానికి/బలైపోయిన నేను/భారత స్త్రీని!! అంటూ విప్లవ తిరుగుబాటు స్పురిస్తు స్త్రీవాద కవిత్వాన్ని సృష్టించారు. నేను పుట్టక ముందే/దేశద్రోహుల జాబితాలో నమోదైఉంది నాపేరు/ముస్లింలను దేశద్రోహులుగా చిత్రించడాన్ని ఖాదర్ మొహీముద్దీన్ కవిత్వీకరించిన తీరును, దళిత మైనార్టీ స్త్రీవాద సాహిత్యాన్ని తులనాత్మక పరిశీలన చేశారు హసేన్. తెలంగాణ జీవన చిత్రనకు దర్పణం ‘పొత్తి‘ఈ నవల తెలంగాణలోని సామాజిక జీవన విధానాన్ని గ్రామీణ ప్రాంతపు నేపథ్యాన్ని మాండలిక భాషా పదాలను ఉపయోగించి తెలంగాణ శిల్పాన్ని తెలియజేశారు. తెలుగు సాహిత్యంలో ఇటు భావకవిత్వానికి, అటు అభ్యుదయ కవిత్వానికి, మధ్యయ మార్గంగా సాహిత్యాన్ని కొనసాగించిన వారు బాలగంగాధర్ తిలక్ ఆయన రచన అమృతం కురిసిన రాత్రి/అందరూ నిద్రపోతున్నారు/నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి/ఎక్కడికో దూరంగా/కొండ దాటి కోన దాటి/వెన్నెల మైదానంలోకి/వెళ్లి నిలుచున్నాను. అనే తిలక్ అద్భుతమైన కల్పానికి భావ కవిత్వానికి ఓ నిదర్శనం ఈ కవితా సంపుటి 1971లో కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు దక్కించుకొని తెలుగు సాహిత్యానికి గౌరవం దక్కించిన తీరు అద్వితీయంగా వివరించారు రచయిత.
ఇక తెలుగు సాహిత్యం విషయానికొస్తే చాలామంది కవులు పలు సృజనాత్మక రచనలు చేసి సమాజంపై జరగని ముద్ర వేశారు. వారిలో డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రముఖులు. నేను పుట్టక ముందే/నెత్తి మీద నీలి తెర/కాళ్ళ కింద ధూళి పొర/ధూళి పొరల్లో పొడిచిన/విత్తుల పొత్తికడుపులో/చెట్లు నెత్తురు పోసుకున్నాయి. ఈ వాక్యాలలో మనకు అర్థమవుతుంది. సీనారే కవిత్వం యొక్క తీరు ఈ విశ్వంభరకు 1988లో జ్ఞానపీఠ అవార్డు వరించటం సీనారే కవిత్వంలోని మానవతావాదం తాత్విక చింతన ప్రకృతి విశ్వాంతరాలకు అద్దం పట్టింది అని డాక్టర్ హసేన్ అక్షరార్చన అద్భు తం. తెలుగు సాహిత్యము నుండి 2004వ సంవత్సరంలో గుంటూరు శేషేంద్ర శర్మ ‘నా దేశం నా ప్రజలు‘ కావ్యం నోబుల్ సాహిత్య బహుమతికి నామినేట్ కావటం తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం. ‘నదులు కవులు భూగోళపు రక్తనాళాలు/నదులు ప్రవహిస్తాయి/కవితల్లా పక్షుల కోసం పశువుల కోసం/మనుషుల కోసం/నదులు కంటున్న కలలు పొలాల్లో/ఫలిస్తాయి/ దరిత్రిని హలం దున్నితే/అప్పుడు అవుతుంది/అది ఒక దేశం/దరిత్రిని కలం దున్నితే/అది ఒక ఇతిహాసం.
శేషేంద్ర కవిత్వం గూర్చి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు హసైన్. గగనమెక్కిన పాట గద్దరన్న అనే శీర్షికతో గద్దర్ ఒక ప్రభంజనం, ఒక ఉప్పెన, జన సమ్మోహన శక్తి, ప్రజా ఉద్యమకారుడు, ఒక చరిత్ర, విప్లవం, ఎర్రజెండా చేతబట్టి, వేదికలెక్కి మానవ సంబంధాల వారధిగా సాహితీ వేతగా, విప్లవ సాహిత్యానికి సారథిగా ఇలా అనేక కోణాల్లో గద్దర్‌ను పరిశీలించి పరిశోధన వ్యాసం రాశారు విమర్శకులు డాక్టర్ హసేన్.హసేన్ అటు సమాజాన్ని ఇటు సాహిత్యాన్ని మిళితం చేసి చారిత్రక, రాజకీయ, ఆర్థిక ,సామాజిక, సాంస్కృతిక, అంశాలను కోడీకరించి నేటి సాహితీ యువతరానికి సరికొత్త మార్గం చూపారు. ఇది తెలుగు సాహిత్యానికి ఒక పరిశోధనా గ్రంథం ‘తదేక’ సాహిత్యానికి ఒక దిక్సూచిగా చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శకు యువ రక్తం మహమ్మద్ హసేన్ అని ఆచార్య ధార్ల వెంకటేశ్వరరావు అభిప్రాయాన్ని అక్షరాల నిజం చేశారు. డాక్టర్ మహమ్మద్ హసేన్‌కి సాహితీ అక్షర అభినందనలు తెలియజేస్తూ..