వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను పొమ్మనలేక పొగబెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరిలో లోకేశ్ ను ఓడించిన తనకే పార్టీనుంచి సహకారం లభించలేదని, నిధులు మంజూరు చేస్తామని చెప్పినా మంజూరు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మంగళగిరిలో విలేఖరులతో మాట్లాడారు.
తాను స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశానని, దానిని అంగీకరించడం, అంగీకరించకపోవడం వాళ్ల ఇష్టమని రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే తాను ఆమెతోనే నడుస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరినా వెంటనే ఆ విషయాన్ని చెబుతానన్నారు. చాలామంది తనను ఇతర పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారనీ, కానీ తాను వైఎస్ కుటుంబంతోనే ఉన్నానని, భవిష్యత్తులోనూ ఉంటానని చెప్పానని ఆయన తెలిపారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే, వాటిపైనా కేసులు పెడతానని చెప్పారు.