ప్రయాగ్‌రాజ్ : అధికారిక నివాసంలో భారీ ఎత్తున నగదు కట్టలు వెలుగు చూసినట్లుగా తెలుస్తున్న ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బదలీని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. అలహాబాద్‌హైకోర్టు ‘చెత్త బుట్ట కాదు’ అని అసోసియేషన్ వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు కొలీజియం ఆ న్యాయమూర్తిని బదలీ చేసిందన్న వార్త వచ్చిన వెంటనే ఆమోదించిన ఒక తీర్మానంలో అసోసియేషన్ ‘జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం కోర్టు బదలీ చేయడం మాకు దిగ్భ్రాంతి కలిగించింది’ అని తెలియజేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అనిల్ తివారీ సంతకం చేసినట్లు తీర్మానం తెలిపింది. న్యాయమూర్తి ఇంటిలో బహిర్గతమైన ‘లెక్క చూపని డబ్బు రూ. 15 కోట్లు’అని తీర్మానం వెల్లడించింది. ‘సుప్రీం కోర్టు ఈ వ్యవహారాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
అలహాబాద్ హైకోర్టు ఒక చెత్త బుట్టా అనే తీవ్ర ప్రశ్నను కొలీజియం నిర్ణయం లేవనెత్తుతోంది’ అని తీర్మానం పేర్కొన్నది. జస్టిస్ వర్మ బదలీపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తుల కొరత వంటి సమస్యలను, సుప్రీం కోర్టు ‘పదే పదే’ హైకోర్టును అభిశంసించడాన్ని కూడా అసోసియేషన్ తమ తీర్మానంలో ప్రస్తావించింది. ‘ప్రస్తుతం మేము ముఖ్యంగా న్యాయమూర్తుల కొరత వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. దీని వల్ల కొత్త కేసుల విచారణ నెలల తరబడి జరగడం లేదు. దీనితో చట్టబద్ధ పాలనపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది. అయితే, మాది చెత్త బుట్ట అని దీని అర్థం కాదు. మేము అవినీతిని ఆమోదించేందుకు సిద్థంగా లేము’ అని అసోసియేషన్ తమ తీర్మానంలో స్పష్టం చేసింది.