Monday, December 23, 2024

జ్ఞానవాపి మసీదు.. ఎఎస్‌ఐకి అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్ రాజ్: వారణాసి జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా( ఎఎస్‌ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టుఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయప్రయోజనాల దృష్టా ఎఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులతో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.ఈ మేరకు వారణాసి కోర్టుఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ ఆలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకోవడం కోసం మసీదు ప్రాంగణాన్ని పురావస్తు పరిశోధనా సంస్థ( ఎఎస్‌ఐ) చేత శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జులై 21న అనుమతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజుఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంతమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఎఎస్‌ఐను ఆదేశించింది.ఆగస్టు 4 లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఎస్‌ఐ జులై 24 సర్వే మొదలు పెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆదేశించింది.సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు స్టే విధిస్తూ, వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైన కొద్ది గంటలకే సర్వే ఆగిపోయింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోరులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జులై 27న విచారణ చేపట్టిన హైకోర్టు ఆగస్టు 3న తీర్పు వెలువరించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా గురువారం మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. కాగా శుక్రవారంనుంచి సర్వేను మొదలు పెట్టడానికి ఎఎస్‌ఐ స్థానిక అధికార యంత్రాం సహాయాన్ని కోరినట్లు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్( కలెక్టర్) ఎస్ రాజలింగం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News