Wednesday, January 22, 2025

కోరిక తీరిస్తే.. వైద్య ఖర్చు భరిస్తానన్నాడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లతో ఆయన చాలా దారుణంగా వ్యవహరించాడని, ఛాతీపై తాకడం, అసభ్య పదజాలంతో సంభాషించడం వంటివి చేసే వారని మహిళా అథ్లెట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కాపీలోని అంశాలను పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి మహిళా అథ్లెట్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏడుగురు మహిళా రెజ్లరు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీసు స్టేషన్‌లో గత నెల రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఆరుగురు మహిణా కెజ్లర్లతో ఒక ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో మరో ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 28న నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ తమతో అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఆరోపించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఆయనకు భయపడి మహిళా రెజ్లర్లు ఎప్పుడు బయటికి వచ్చినా గ్రూపులుగానే ఉండేవారట.‘ అయినప్పటికీ ఆయన మా బృందంలోని ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగే వారు. వాటికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడేవాళ్లం’ అని ఓ బాధితురాలు తమ ఫిర్యాదులో పేర్కొంది.‘ ఒక రోజు నేను శిక్షణ పొందేటప్పుడు ఆయన నన్ను పిలిచి టీ షర్టు లాగారు. శ్వాసప్రక్రియను చెక్ చేస్తున్నానంటూ నా ఛాతీపై, పొట్టపై అభ్యంతరకరంగా తాకారు. ఓ సారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు.

దాన్ని తింటే చాలా ఫిట్‌గా ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పారు’ అని మరో బాధితురాలు ఆరోపించారు. కోచ్ లేని సమయంలో తమ వద్దకు వచ్చి ఇలాగే అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించేవారని అవార్డు గెలుచుకున్న మరో రెజ్లర్ ఆరోపణలు చేశారు.‘ విదేశాల్లో జరిగిన ప్రదర్శనలో నేను గాయపడ్డాను. అప్పుడు ఆయన (బ్రిజ్ భూషణ్) నా వద్దకు వచ్చి తన కోర్కె తీరిస్తే ట్రీట్‌మెంట్ ఖర్చంతా ఫెడరేషనే భరిస్తుందని చెప్పారు’ అని మరో బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ఫొటో తీసుకుందామంటూ తనను గట్టిగా హత్తుకున్నారని మరో అథ్లెట్ ఆరోపించింది. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా ఓ రెజ్లర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

ఓ సారి తాను ఢిల్లీలోని డబ్లుఎఫ్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు తోమర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ రెజ్లర్ ఆరోపించారు.గదితో అందర్నీ బైటికి పంపించి తనను బలవంతంగా ఆయన వైపు లాక్కున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఫోటో తీసుకుంటామన్న నెపంతో బ్రిజ్ భూషణ్ తన కుమార్తెను తన వైపునకు లాక్కుని విడిపించుకోవడానికి వీలు లేని రీతిలో గట్టిగా పట్టుకున్నారని, అభ్యంతరకరమైన రీతిలో ఆమె భుజాలు, ఛాతీ తాకారని మైనర్ అథ్లెట్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ మొదటినుంచీ తోసిపుచ్చుతూనే ఉన్నారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాను ఉరి వేసుకోవడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కాగా బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై త్వరలోనే తుది నివేదికను కోర్టులో సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమైనటు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News