Sunday, September 8, 2024

రాజకీయ అస్థిరతకు చిరునామా

- Advertisement -
- Advertisement -

రాజకీయ అస్థిరత ఉన్న చోట అభివృద్ధికి చోటు ఉండదు. పొరుగున హిమాలయ పర్వతపాదం వద్ద ఉన్న నేపాల్‌ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దాదాపు పదిహేనేళ్లుగా నేపాల్ రాజకీయ అస్థిరతకు ఆలవాలంగా మారింది. 2008లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చాక, ఆ తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒకదాని తర్వాత ఒకటిగా 13 ప్రభుత్వాలు మారాయంటే నేపాల్‌లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

తాజాగా అధికారంలో ఉన్న పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో సిపిఎన్- యుఎంఎల్ పార్టీ అధినేత కెపి శర్మ ఓలి, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సి)తో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్రధానిగా ఓలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. గతంలో రెండు సార్లు ప్రధానిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయినప్పటికీ ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా ఎంత కాలం అధికారంలో ఉంటుందో తెలియదు.ఎందుకంటే మరో మాజీ ప్రధాని దేవ్ బా నాయకత్వంలోని పార్టీతో ఆయన అధికారం పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ మేరకు తొలి 18 నెలలు ఓలి, ఆ తర్వాత మరో 18 నెలలు దేవ్ బా ప్రధానిగా ఉంటారు. ఈలోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎన్ని వెన్నుపోటు రాజకీయాలు జరుగుతాయో ఊహించడం కష్టం. బలపరీక్షలో గట్టెక్కేందుకు రాజ్యాంగపరంగా ఓలికి నెల రోజుల సమయం ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరనే నానుడి నేపాల్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ హిమాలయ దేశ రాజకీయాల్లో కొంతకాలంగా మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. ప్రచండ, ఓలి, దేవ్ బా ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుతూ, రాజకీయ అస్థిరతకు ఆజ్యం పోస్తున్నారు.

రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)కు వచ్చిన స్థానాలు కేవలం ముప్ఫై రెండే. అయితే దేవ్ బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌తో ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల హంగ్ ఏర్పడినా ప్రచండ ప్రధాని కాగలిగారు. అయితే కొంత కాలానికి రాజకీయ విభేదాలతో నేపాల్ కాంగ్రెస్‌కు దూరమై, ఓలీతో జట్టు కట్టారు. కానీ ఓలీతో సైతం విభేదాలు ఏర్పడటం, సిద్ధాంతపరంగా ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉండే ఓలి, దేవ్ బా పార్టీలు చేతులు కలపడంతో ప్రచండ అధికారంనుంచి తప్పుకోక తప్పలేదు. ప్రచండ 2022లో ప్రధాన మంత్రి పదవి చేపట్టాక, నాలుగుసార్లు అవిశ్వాస తీర్మానాలను గట్టెక్కగలిగారు. ఐదోసారి మాత్రం పదవిని వదులుకోవలసిన వచ్చింది.

ప్రచండ అధికారంలో ఉన్నంత కాలం అటు చైనాతోను, ఇటు భారత్ తోను నొప్పించక, తానొవ్వక అనే రీతిలో మసలుకున్నారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన ఓలి చైనా అనుకూల నేతగా పేరొందారు. గతంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలు వివాదాలు రేకెత్తించాయి. పైగా ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాలను నేపాల్ భూభాగాలుగా దేశ పటంలో చూపించడం వివాదాస్పదమైంది. చైనా భారీ యెత్తున రుణాలు ఇచ్చి నేపాల్‌ను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజా సంకీర్ణ ప్రభుత్వంలో ఓలికి మద్దతు ఇస్తున్న దేవ్ బా భారత్‌కు సన్నిహితుడు. దేవ్ బాను కాదని ఓలి ఏకపక్షంగా చైనా అనుకూల విధానాలు అవలంబించలేరు. కాబట్టి నేపాల్ నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లేమీ ఉండవని భావించవచ్చు.

రాజకీయ అస్థిరత కారణంగా నేపాల్‌లో నిరుద్యోగం నానాటికీ పెచ్చుమీరిపోతోంది. యువత ఉపాధి అవకాశాల కోసం పొట్టు చేతబట్టుకుని అటు చైనాకో, ఇటు భారత్ కో సరిహద్దులు దాటి వలసపోతున్నారు. మరోవైపు ధరల పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారింది. పర్యాటకం మినహా అన్ని రంగాల్లోనూ నేపాల్ క్రమేణా వెనుకబడుతోందన్న విషయాన్ని నేతలు విస్మరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. బాధ్యత గల రాజకీయ పార్టీలు ప్రధానమైన ఈ సమస్యల పట్ల దృష్టి సారించకుండా అధికారం కోసం పెనుగులాడుతూ కాలం వెళ్లబుచ్చుతూ ఉండటం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News