పొన్నాల పార్టీ మారడం బాధాకరం
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచారకమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: టికెట్లు రాని వారు పెద్ద మనసుతో టికెట్లు వచ్చిన వారికి సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచారకమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేయాలని ఆయన సూచించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు కాంగ్రెస్‌కు కొంత నష్టమేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
నీడను ఇచ్చిన చెట్టును నరుక్కోవడం సరికాదంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొన్నాలకు ఉమ్మడి ఎపి రాష్ట్రంలో గుర్తింపునిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ఆయన పార్టీ మారడం బాధాకరమన్నారు. టికెట్ రానంత మాత్రాన కాంగ్రెస్‌ను పొన్నాల నిందించడం తగదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.