Monday, December 23, 2024

మాతోనే ఐక్యత.. వాళ్లతో విభజన

- Advertisement -
- Advertisement -

ప్రతికూలతల ఆధారంగా ఏర్పడే కూటములు
ఎన్నటికీ నెగ్గవు కుటుంబాలు, కులం,
ప్రాంతం పేరుతో ఏర్పడే ఫ్రంట్‌లు దేశానికి
హానికరం స్థిరమైన ప్రభుత్వం వల్లే
ప్రపంచానికి మనపై విశ్వాసం ఎవరికో
శత్రువుగా ఉండేందుకు ఎన్‌డిఎ ఏర్పాటు
కాలేదు భవిష్యత్‌లో కలిసి వచ్చే పార్టీలను
స్వాగతిస్తున్నాం మా హయాంలోనే మూడో
అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుంది
ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోడీ 38 పార్టీలు హాజరు

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎను దీటుగా ఎదుర్కోవడం కోసం ప్రతిపక్షాలు ‘ఇండియా’పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వ్యతిరేకత ఆధారంగా ఏర్పడే కూటములు ఎప్పటికీ గెలవబోవని, అధికారం కోసం, అలాంటి కూటమి కుటుంబ, అవినీతిపరమైనప్పుడు దేశం నష్టపోతుందన్నారు. అధికారం కోసం, కుటుంబ రాజకీయాల ఆధారంగా, కులుం, ప్రాంతీయతలను దృష్టిలో పెట్టుకుని ఏర్పడే కూటములు దేశానికి హాని కరమని ఆయన అన్నారు.

బిజెపి నేతత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల నేతలనుద్దేశించి మంగళవారం ప్రధాని మాట్లాడుతూ ఎన్‌డిఎ దేశ ప్రజలను సంఘటితం చేస్తే ప్రతిపక్షం వాళ్లను విడదీసిందన్నారు. ‘ దేశంలో స్థిరమైన పాలన తీసుకురావడానికే ఎన్‌డిఎ కూటమి. అద్వానీయే ఎన్‌డిఎకు మార్గదర్శకులు. ఎన్‌డిఎను నిర్మించింది వాజపేయి, అద్వానీలే. కూటమిలోని కొత్త మిత్రులకు స్వాగతం. ఎన్‌డిఎ పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం ఉంది.దేశ ప్రగతిలో ఎన్‌డిఎ అత్యంత కీలకం. దేశంలో ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడూ సఫలం కాలేదు.

కాంగ్రెస్ కూటమి ప్రజావ్యతిరేక కూటమి. ఆత్మనిర్భర్ భారత్ పురోభివృద్ధి లక్ష సాకారానికి కృషి. దేశ ప్రజలు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు’ అని ప్రధాని అన్నారు. ఎన్‌డిఎకు కొత్త నిర్వచనం చెప్పిన మోడీ…ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌నేషన్, ఎ అంటే యాస్పిరేషన్ ఆఫ్ పీపుల్ అని అన్నారు. అన్ని వర్గాలకు ఎన్‌డిఎపై నమ్మకం ఉంది.అందరి కృషి వల్లే దేశం అభివృద్ధి పథంలో సాగుతోంది అని అన్నారు.‘ఎన్‌డిఎ హయాంలో 13.5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు పైకి వచ్చారు.ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చిన ఘనత ఎన్‌డిఎది.విపక్ష పార్టీలు నన్ను నీచుడని నిందిస్తున్నాయి.ఎన్‌డిఎ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుంది.

ఎన్‌డిఎ కూటమిలో చిన్నా, పెదద పార్టీలన్న తేడా లేదు.గాంధీ, అంబేద్కర్, లోహియా సిద్ధాంతాలను ఎన్‌డిఎ ఆచరిస్తుంది. ఆదివాసి మహిళలను రాష్ట్రపతి చేసిన ఘనత ఎన్‌డిఎది.అవినీతిని అంతం చేసేందుకు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నాం. మేకిన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం.సమష్టి కృషితోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి.వంశపారంపర్య, అవినీతి పార్టీలతో దేశానికి నష్టం.ప్రభుత్వ ఏర్పాటు లక్షంతో ఎన్‌డిఎ ఏర్పాటు కాలేదు. మరొకరికి శత్రువుగా ఉండేదుకు ఎన్‌డిఎ ఏర్పాటు కాలేదు.స్థిరమైన ప్రభుత్వం వల్లనే ప్రపంచానికి మనపై నమ్మకం పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన చేశాం.1990 దశకంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను అస్థిరం చేసేందుకు కూటములను ఉపయోగించింది. కూటముల పేరుతో వాళ్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని కూల్చారు.

ఈ సమయంలోనే 1998లో ఎన్‌డిఎ ఏర్పాటయింది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఏర్పాటు కాలేదు. దేశంలో సుస్థిరతను తీసుకు రావడం కోసం ఏర్పాటయింది. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం.దేశప్రగతి నినాదంతోనే ఎన్‌డిఎ ముందుకు వెళ్తోంది. భవిష్యత్తులో ఎన్‌డిఎతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నాం.దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అజెండా.దేశ ప్రగతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. నవభారత నిర్మాణం ఎన్‌డిఎ లక్షం. దేశం తలవంచుకునే పనులు ఎన్‌డిఎ ఎప్పుడూ చేయదు.నిబద్ధతతో ప్రజలు తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నాం’ అని ప్రధాని మోడీ అన్నారు.

ఎన్‌డిఎలో38 పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆ పార్టీల నేతలు సమావేశం వేదిక వద్దకు చేరుకున్నప్పుడు వారికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అంతకు ముందు వేదిక వద్దకు చేరుకున్న ప్రధానికి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , అన్నాడిఎంకె నేత ఇకె పళనిస్వామి తదితరులుసాగతం పలికారు. ప్రధాని వేదిక వద్ద ఆయా పార్టీల నేతల వద్దకు వచ్చి కలిశారు. ఎల్‌జెపి నేత చిరాగ్ పాశ్వాన్ ప్రధానికి పాదాభివందనం చేయగా ప్రధాని ఆయనను ఆలింగనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News