Thursday, March 6, 2025

అగ్రరాజ్యానికి దూరమవుతున్న మిత్రదేశాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచమంతా ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించే చర్చించుకుంటున్నది. బుల్లితెరపై ఒక హాస్యనటుడిగా పని చేసి, అనేక మంది ప్రజల అభిమానం సంపాదించుకుని అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ప్రజలకు మరింత చేరువై, అవినీతి రహిత పాలన అందిస్తానని, రాజ్యాంగాన్ని మారుస్తానని వాగ్దానం చేసి, 2019 ఎన్నికల్లో ఉక్రెయిన్‌కు అధ్యక్షుడైన వ్లాదిమిర్ జెలెన్ స్కీ పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. కోవిడ్ నుంచి ఉక్రెయిన్ కోలుకునేలోగా ఉక్రెయిన్‌ను రష్యా యుద్ధం ముంచెత్తింది. నాటోలో చేరాలనే జెలెన్ స్కీ వాదం రష్యాకు కోపం తెప్పించింది. నాటో దళాలు ఉక్రెయిన్ భూభాగాల్లోకి వస్తే అది అంతిమంగా రష్యా సార్వభౌమత్వానికి విఘాతం లా మారుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించారు. జెలెన్ స్కీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో కూటమిని నమ్ముకుని రష్యాతో యుద్ధానికి దిగడం వ్యూహాత్మక తప్పిదమనే చెప్పాలి.

అయినప్పటికీ రష్యాను ఎదుర్కోవడంలో జెలెన్ స్కీ సాహసోపేతంగానే పోరాడిన విషయం విదితమే. కోవిడ్ సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు. యుద్ధ సమయంలో స్వయంగా మిలిటరీ దుస్తులు ధరించి ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగారు. అమెరికా నుండి లక్షల కోట్ల రూపాయల ఆర్థిక, ఆయుధ సహాయం పొంది, శత్రుభయంకరమైన బలమైన రష్యాతో దీటుగా యుద్ధరంగంలోకి దిగి, ఒకానొక సమయంలో రష్యా భూభాగాల్లోకి తన సైన్యాన్ని చొప్పించి, పుతిన్‌కు సైతం ముచ్చెమటలు పట్టించిన జెలెన్ స్కీ అమెరికా రాజకీయ ముఖచిత్రం మారడంతో, ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోక తప్పని పరిస్థితుల్లో వైట్‌హౌస్‌కు రావడం జరిగింది. ఉక్రెయిన్ దేశంలోని రేర్ ఎర్త్ మినరల్స్ కోసం డీల్ కుదుర్చుకోవాలని ఉబలాటపడిన ట్రంప్‌కు జెలెన్ స్కీ సంధించిన ప్రశ్నలు చిక్కుముడిగా మారిపోయాయి. శాంతి ఒప్పందం అటకెక్కింది. ఇప్పటి వరకు బిలియన్ డాలర్ల సహాయం చేసినందుకు ఉక్రెయిన్‌లో నిక్షిప్తమైన ఖనిజ సంపదలో 50% వాటా తమదే నంటూ ట్రంప్ పట్టుబట్టినా, ఉక్రెయిన్‌కు రష్యా నుండి భద్రత విషయంలో హామీ ఇవ్వకుండా ఎలాంటి ఒప్పందం చేసుకోబోనని జెలెన్ స్కీ ట్రంప్ మొహం పైనే తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

ట్రంప్ షరతులను అంగీకరించి, రష్యాతో సంధి కుదుర్చుకుని, జెలెన్ స్కీ ఒక కమెడియన్‌గా మారిపోతారని భావించిన వారి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ, శ్వేతసౌధంలో జెలెన్ స్కీ ట్రంప్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి ప్రపంచం దృష్టిలో అమెరికాను ధిక్కరించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. నాటో కూడా జెలెన్ స్కీ వైపే నిలబడింది. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు ఉక్రెయిన్ వైఖరిని సమర్థించాయి. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ బలోపేతానికి బ్రిటన్ ఏకంగా 3 బిలియన్ డాలర్ల సహాయం ప్రకటించడం ట్రంప్‌కు ఎదురుదెబ్బ కాగలదు. తన వితండవాదంతో, మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ట్రంప్‌కు యూరోపియన్ దేశాలు ఎదురు తిరుగుతున్నాయి. మెక్సికో నాది, పనామా నాది, గ్రీన్‌లాండ్ నాది,- కెనడా నాది అంటూ తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు క్రమేపీ మిత్రదేశాలు కూడా దూరమైపోతున్నాయి. యూరప్ నుంచి 30 దేశాలు, ఉత్తర అమెరికా నుంచి అమెరికా, కెనడాలు నాటో సభ్యదేశాలుగా ఉన్నాయి. తనకు చిరకాల ప్రత్యర్ధిగా ఉన్న రష్యాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఓటేయడం మిత్రదేశాలుగా ఉన్న యూరప్ దేశాలను నిందించడం, తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్‌కు ఎందుకు సహాయం చేయాలని గర్జించడం అమెరికాకు తగనిపని. ట్రంప్ పాలనలో అమెరికా ఎటు వైపు పయనిస్తుందో ఎవరికీ అవగతం కావడం లేదు.

క్లీన్ ఎనర్జీ విషయంలో కూడా విభేదించి, వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందంనుంచి మరోసారి వైదొలగడం ట్రంప్ అహానికి పరాకాష్ఠ. ఇప్పటికే అమెరికా డబ్ల్యుహెచ్‌ఒ నుండి వైదొలగింది, సమీప భవిష్యత్తులో నాటోలో ఉంటుందో లేదో తెలియదు, ఐక్యరాజ్య సమితిలో ఉంటుందో లేదో తెలియదు. పనామా కాలువ విషయంలో ట్రంప్ పోకడ అభ్యంతకరం. ఒకప్పుడు స్పానిష్ పాలనలో ఉండి, తర్వాత కొలంబియాలో ఒక ప్రావెన్స్‌గా ఉన్న పనామా 1903లో కొలంబియా నుండి స్వాతంత్య్రం ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా అవతరించింది. ఫసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కాలువ నిర్మాణం జరిగింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను కలిపే పనామా కాలువ నిర్మాణం ఫ్రెంచ్‌వారు ప్రారంభించగా, అమెరికా దశాబ్దకాలం కష్టించి, పనమా కాలువ నిర్మాణం పూర్తిచేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ హయాంలో పూర్తయిన పనామా కాలువ నిజానికి అమెరికా కృషి ఫలితమే. పనామా కాలువను అమెరికా నిర్మించినా, జిమ్మీ కార్టర్ పనామా కాలువను పనామా దేశానికి 48 ఏండ్ల క్రితం అప్పగించాడు. ఈ కారణంగా పనామా కాలువపై అమెరికాకు ప్రస్తుతం ఎలాంటి అధికారం లేదు. ఇతర దేశాల మాదిరిగానే అమెరికా కూడా తన వాణిజ్య అవసరాల కోసం పనామా కాలువను ఉపయోగించుకోవచ్చు.

ట్రంప్ ఆరోపిస్తునట్టుగా పనామా కాలువలో చైనా జోక్యం లేదని చైనా, యూరోపియన్ యూనియన్, యుఎస్‌లకు పనామా కాలువతో సంబంధం లేదని ప్రస్తుత పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ఇటీవల పేర్కొన్నారు. పనామా జలమార్గాన్ని వాణిజ్య అవసరాల కోసం వినియోగించే దేశాల్లో అమెరికాది ప్రథమ స్థానం, తర్వాత స్థానాల్లో చైనా, జపాన్‌లున్నాయి. పనామా కాలువను ఆక్రమించుకోవడానికి ప్రస్తుతం ట్రంప్ ప్రయత్నించడం క్షంతవ్యం కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల విముఖత, బ్రిక్స్ దేశాల పట్ల ఆగ్రహం ట్రంప్ అసహనాన్ని సూచిస్తున్నది. ప్రపంచ దేశాల వాణిజ్య వ్యవహారాలన్నీ డాలర్‌తోనే జరగాలని అమెరికా శాసించడం విజ్ఞత కాబోదు. ప్రతీ దేశం ఇతర దేశాలకు దీటుగా, ఆర్థ్ధికంగా ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ తన నినాదాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని కూడా తప్పుపట్టలేం. అయితే తన ఖజానా నింపుకోవడానికి ఇతరుల జేబులు కొట్టడమే అభ్యంతరకరం. భయపెట్టి ఇతర దేశాల సంపద కొల్లగొట్టి, ఎదురు తిరిగిన దేశాల భరతం పట్టాలనే ధోరణి సముచితం కాదు.

ఇతర దేశాలను ఆక్రమించాలనుకోవడం, ఇతర దేశాల వస్తువులపై అధిక శాతం సుంకాలు విధించడం, ఇతర దేశాల అభివృద్ధిని నాశనం చేయాలనుకోవడం అమెరికా దివాళా కోరుతనానికి నిదర్శనం. ట్రంప్ విధానాలతో విసుగెత్తిపోయిన అమెరికా మిత్రదేశాలు కూడా అమెరికాకు దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశించడం అత్యాశ కాబోదు. ఇప్పటికే అమెరికా డాలర్ ప్రపంచ వాణిజ్యవిపణిని శాసిస్తున్న నేపథ్యంలో చాలా దేశాల కరెన్సీ విలువ దారుణంగా తగ్గిపోతున్నది. డాలర్ ప్రభావంతో భారత కరెన్సీ చాలా సంవత్సరాలుగా పతనంలో పయనిస్తున్నది. ఇది అభివృద్ధికి చిహ్నం కాదు. అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు స్వంత కరెన్సీ రూపకల్పనకు ప్రయత్నాలు చేయడం ట్రంప్‌కు రుచించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్- రష్యాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని నివారించాలనుకోవడం హర్షించదగ్గ విషయమే. అయితే ఇందుకు అనుసరిస్తున్న పద్ధతి ఆక్షేపణీయం. ట్రేడ్ డీల్ పేరుతో ఉక్రెయిన్‌లోని రేర్ ఎర్త్ మినరల్స్ కొల్లగొట్టాలనుకోవడం, ఉక్రెయిన్ భద్రతకు హామీని ఇవ్వకపోవడం సరైన చర్య కాదు. జెలెన్ స్కీ కూడా ఆవేశంతో దౌత్య నియమాలను ఉల్లంఘించి, శ్వేత సౌధానికున్న విలువను దిగజార్చడానికి యత్నించడం అనుచితం.

ఎవరు ఉక్రెయిన్‌కు అండగా నిలబడాలనుకున్నా, అమెరికా సహకారం లేనిదే జెలెన్ స్కీ సాధించేదేమీ ఉండదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సాగదీయాలనుకుంటే, ఇప్పటికే 20% భూభాగాలను కోల్పోయిన ఉక్రెయిన్ పూర్తిగా రష్యాపరమయ్యే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఆపదలో ఉన్న ఉక్రెయిన్ బలహీనతను ట్రంప్ అవకాశంగా తీసుకోవడం సమంజసంగా లేదు. తన స్వంత బలం మీద ఆధారపడకుండా ఇతర దేశాల ఆయుధ బలగంపై ఆధారపడుతూ మూడేండ్లు యుద్ధం చేసిన జెలెస్కీ ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ట్రంప్‌ను, పుతిన్‌ను ధిక్కరించిన హీరోగా మిగలవచ్చు. రష్యాతో ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తే, రాగల పరిణామాలు భయంకరంగా మారే అవకాశాలున్నాయి. పరిస్థితులు వికటిస్తే జెలెన్ స్కీని పొగిడినవారే ద్వేషించే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు.

సుంకవల్లి సత్తిరాజు
97049 03463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News