న్యూఢిల్లీ: దేశంలో జనాభా గణన కోసం తాత్కాలిక బడ్జెట్‌లో కేవలం రూ.1,277.68 కోట్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2021-22 సంవత్సరంలో రూ.3,738 కోట్లు కేటాయించగా దాంతో పోలిస్తే కేటాయింపులు ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్నాయి. మూడేళ్ల జాప్యం తర్వాత కూడా జనాభా గణన ఈ ఏడాది కూడా మొదలయ్యే సూచనలు కనపడడం లేదు. రూ. 8,754.23 కోట్ల ఖర్చుతో 2021 సంవత్సర జనాభా గణన, రూ.3,941.35 కోట్ల ఖర్చుతో జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్) సవరణ చేపట్టాలని
2019 డిసెంబర్ 24న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆమోదించింది.ఈ రెండు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొవిడ్ 19 కారణంగా ఇది వాయిదా పడింది. అప్పటి నుంచి జనాభా గణన కార్యక్రమం నిలిచిపోగా కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించవలసి ఉంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున జనాభా గణన 2024లో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.