Tuesday, September 17, 2024

మద్యం షాపుల డ్రా ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

Allocation of 2572 new liquor shops in lottery

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీలో 2572 కొత్త మద్యం షాపుల కేటాయింపు
18జిల్లాల్లోని 48షాపులకోసం సిండికేటు అయ్యారని ఫిర్యాదు
రావడంతో వాటికి లాటరీ నిలిపివేత, విచారణ చేపట్టిన అధికారులు
వీటిపై సోమవారం ప్రకటన వెలువడే సూచన
చెదురుమదురు ఘటనలు మినహా లాటరీ ప్రశాంతం
జగిత్యాల జిల్లాలో ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేసిన పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం శనివారం లాటరీ పద్ధతిలో 2,572 షాపులకు డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ షాపులను ఎంపిక చేశారు. చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంతంగా డ్రా పద్ధతిలో కొత్త మద్యం షాపు యజమానులను ఎక్సైజ్ శాఖ ఎంపికచేసింది. దుకాణాల వారీగా డ్రాలను తీశారు. ముందుగా ఆ దుకాణానికి సంబంధించిన దరఖాస్తుదారులను పిలిచి వారి సమక్షంలో సీరియల్ నంబర్ ఆధారంగా టోకెన్లను డబ్బాలో వేసి డ్రా తీశారు. పాసులు ఉన్న వారినే మాత్రమే డ్రా జరిగే చోటకు అనుమతించారు. వేలాన్ని చూడడానికి భారీగా ప్రజలు తరలిరావడంతో డ్రా తీసే ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. డ్రా తీసే ప్రాంతమంతా దరఖాస్తుదారుల అనుచరులతో నిండిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు చోటుచేసుకున్నాయి. మద్యం దుకాణాల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని జిల్లాలో వామపక్ష మహిళా సంఘాల నాయకులు అందోళన నిర్వహించారు. డ్రా తీసే ప్రాంగణం లోపలికి చోచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మద్యం షాపులకు ఎంపికైన కొత్త వ్యాపారులు ఈనెలాఖరులోగా ఎక్సైజ్ శాఖ ఫీజును చెల్లించి డిసెంబర్ 01వ తేదీ నుంచి తమ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

సోమవారం 48 షాపులకు సంబంధించి

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం షాపుల కోసం 67,849 దరఖాస్తులు రాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపులకు గాను శనివారం 2,572 షాపులకు మాత్రమే డ్రా నిర్వహించారు. మిగతా 48 షాపులకు (18 జిల్లాలో ) ఉన్న వాటికి గతం కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో, ఇక్కడ సిండికేట్ జరిగిందని ఎక్సైజ్‌శాఖకు ఫిర్యాదులు అందడంతో వాటికి శనివారం వేలం నిర్వహించలేదు. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నేడు ఈ షాపులపై ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ 48 షాపులకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి సోమవారం ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

రిజర్వేషన్‌లను అనుకూలంగా మలుచుకున్న వ్యాపారులు

కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న వారు ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌లను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తమకు దగ్గర సంబంధం ఉన్న వారితో కలిసి గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్‌లను ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరూ సుమారుగా 50 దరఖాస్తులకు తక్కువ కాకుండా వివిధ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఏదో రకంగా గతంలో ఉన్న మద్యం షాపును దక్కించుకోవడానికి వారు ఇలాంటి ప్రయత్నాలను చేపట్టడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన పార్టనర్‌తో కలిసి రెండు, మూడు జిల్లాల్లో 110 దరఖాస్తులను వేయగా హైదరాబాద్‌లో అతనికి 3 షాపులను వేలంలో గెలుచుకున్నారు. ఇలా చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విధంగా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి సుమారుగా 50 దరఖాస్తులు వేస్తే అందులో రెండు దుకాణాలను మాత్రమే గెలుచుకోవడం గమన్హారం.

కరీంనగర్‌లో ఉద్రిక్తత

కరీంనగర్‌లో మద్యం దుకాణాలు లాటరీ పద్ధతి కేటాయింపులో ఉద్రిక్తత చోటు చేసుకొంది. జిల్లాలో 94 మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా డ్రా తీస్తున్న క్రమంలో ఒక షాపు విషయంలో వాగ్వాదం జరిగింది. ఆరో నంబర్ షాపు కేటాయింపు చేయకుండా తాత్సారం చేయడం పట్ల దరఖాస్తుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరు హాజరుకాకపోవడం వల్ల దుకాణం డ్రా తీయకుండా పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు వారికి సర్ధిచెప్పారు.

ఆత్మహత్యయత్నాన్ని విరమింపచేసిన పోలీసులు

లిక్కర్ షాపుల తక్కువగా దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాను నిలిపేశారు అధికారులు. దీంతో దరఖాస్తు దారులకు, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తుండగా సారంగాపూర్ మండలం కేంద్రంలో గెజిట్ నెం. 43లో 6 దరఖాస్తులే వచ్చాయంటూ అధికారులు డ్రా నిలిపేశారు. లిక్కర్ షాపులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని ఆరుగురు దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. వెంటనే డ్రా తీయాలంటూ కాసారపు రమేశ్ అనే దరఖాస్తు దారుడు డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ వరి పొలాల్లోకి పరుగులు తీశాడు. వెంటనే అలర్టైన పోలీసులు యువకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సర్ది చెప్పిన పోలీసులు ఆత్మహత్యయత్నాన్ని విరమింప జేశారు. ఇప్పటికే 18 లక్షలు పెట్టినా ఒక్క షాపులో కూడా తమకు డ్రా రాలేదని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ టెండర్లు వచ్చాయనే కారణంగా అధికారులు డ్రా ఆపేశారని ఎక్కువ టెండర్లు వస్తే అందులో నుంచి తమకు డబ్బులేమైనా ఇస్తారా అంటూ రమేశ్ ఎక్సైజ్ అధికారులను నిలదీశాడు.

కోర్టు కేసులో ఉన్న రెండు దుకాణాలకు..

భూపాలపల్లి, ములుగు జిల్లాలో 60 మద్యంషాపులకు గాను ములుగు జిల్లా మంగపేటలో రెండు దుకాణాలు కోర్టు కేసులో ఉండగా 58 షాపులకు డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు భూపాలపల్లి సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో డ్రా నిర్వహించారు. మొత్తం 1,905 మంది టెండర్లలో పాల్గొన్నారు. అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లి మద్యం షాపులకు 104 దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News