న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ మరోసారి అల్లోపతి వైద్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు. క్యాన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి వ్యాధులు అల్లోపతి వైద్యంతో నయం కావని, కాని ఆయుర్వేదంతో ఈ రోగాలను సమూలంగా నిర్మూలించవచ్చని రాందేవ్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఆదివారం ఉత్తరాఖండ్ ఆయుర్వేద యూనివర్సిటీ, దీనదయాళ్ కామధేను తోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు 2023, ముగింపు సభలో రాందేవ్ ఉపన్యసిస్తూ..ఆవు పాలలో సమృద్ధిగా ఔషధ సంపద ఉందని, ఇవి మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు. ఆవు పాలతో అనేక వ్యాధులు సహజసిద్ధంగానే నయం అవుతాయని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆవుపాలను సేవిస్తారని ఆయన చెప్పారు. తన ఆధ్వర్యంలో నడిచే పతంజలి ఆయుర్వేద సంస్థలో గోమూత్రం, ఆయర్వేద ఔషధాల మిశ్రమంతో క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేసినట్లు ఆయన తెలిపారు.
గతంలో కూడా అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి బాబా రాందేవ్ వివాదంలో చిక్కుకున్నారు.