అధిష్టానంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చించిన సిఎం రేవంత్
ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే…
రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తరువాత మరికొందరికీ శాఖల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: మూడు రోజుల క్రితం ప్రమాణ స్వీకారాలు చేసిన తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శనివారం ఉదయం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిఎం రేవంత్‌కు మున్సిపల్ అండ్ హోంశాఖ, మున్సిపల్, అర్బన్, సాధారణ పరిపాలన శాఖలతో పాటు మరిన్ని కీలక శాఖలను ఆయన వద్దే పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ శాఖలను వారికి కేటాయించనున్నట్లుగా సమాచారం. అయితే మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్‌తో శుక్రవారం రాత్రి వరకు రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. తొలుత రేవంత్ రెడ్డి కెసి. వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికి మాణిక్‌రావు ఠాక్రే, రోహిత్ చౌదరి అక్కడకు వచ్చారు. అనంతరం రాత్రి వరకు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు.
మార్పులు, చేర్పులు సూచించిన ఖర్గే
కీలకశాఖలకు ఎవరికీ ఏం కేటాయించాలనే అనే అంశంపై వారంతా తీవ్రంగా కసరత్తు చేశారు. శాఖలు, ప్రొటోకాల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలన్న అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిసింది. మరో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండడంతో ఆ అంశంపైనా చర్చలు సాగినట్లు సమాచారం. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్, కెసి వేణుగోపాల్, మాణిక్‌రావు ఠాక్రేలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై చర్చించిన అంశాలను ఆయనకు వివరించారు. శాఖలకు సంబంధించి ఖర్గే కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలిసింది.
హోదా… శాఖలు
సిఎం రేవంత్‌రెడ్డి హోంశాఖ, పురపాలక, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వరరావుకు – వ్యవసాయం, చేనేత శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటక శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ
శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్ – రవాణా, బిసి సంక్షేమ శాఖ
సీతక్క – మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ
కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ