నాగర్‌కర్నూల్ ఎంపి అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపి స్థానాలు కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇందులో భాగంగా బిఎస్‌పి పార్టీకి రెండు ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇరు పార్టీల నేతల చర్చల అనంతరం పొత్తుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను బిఎస్‌పికి కేటాయించారు. బిఎస్‌పికి రెండు స్థానాలను కేటాయించినట్లు బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు బరిలో దిగనున్నారో తెలియాల్సి ఉంది. పార్టీ పోటీ చేసే రెండు స్థానాల్లో అభ్యర్థులను బిఎస్‌పి త్వరలోనే ఖరారు చేయనుంది.
మా పొత్తు చారిత్రాత్మక అవసరం
భారత్ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీలు అన్ని లోక్‌సభ స్థానాల్లో పూర్తి పరస్పర సహకారంతో, విజయం దిశగా పయనించబోతున్నాయని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బిఎస్‌పి అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బిఆర్‌ఎస్, బిఎస్‌పి పార్టీ పొత్తు నిర్ణయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బిఎస్‌పి, బిఆర్‌ఎస్ కూటమిలో భాగంగా బిఎస్‌పి తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ (ఎస్‌సి), హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలో దించబోతున్నదని అన్నారు. మిగతా నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పోటీ చేయబోతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.