ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈచిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “పుష్ప జర్నీలో ఐదు నిమిషాల నుంచి ఐదు ఏండ్ల వరకు పనిచేసిన అందరికి నా కృతజతలు. పుష్ప పోస్టర్‌లో నా ఫొటో చూసుకున్న ప్రతిసారి.. నా మీద ఈ టీమ్ అంతా చూపిన ప్రేమే కనిపించింది. మీరు ఎంతో కష్టపడి అద్బుతమైన సినిమా ఇచ్చారు. నిర్మాతలు రవి, నవీన్ లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు. మీరు లేకపోతే ఇలాంటి సినిమా తీసేవాళ్లం కాదు. దేవిశ్రీ ప్రసాద్ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చా డు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన పుష్ప అభిమానులకు నా థ్యాంక్స్. నేను సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పి వదిలేయలేను. ఎందుకంటే అందరికి హిట్ ఇచ్చేది దర్శకుడే. ఈ సినిమా విషయంలో అందరూ సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. సుకుమార్ మాత్రం ఈ సినిమా విజయంలో అందరికి క్రెడిట్ ఇస్తాడు. కానీ అందరికి క్రెడిట్ ఇవ్వడానికి కారణం దర్శకుడు సుకుమారే. నా నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది. దీనికి కారణం దర్శకుడు సుకుమారే. సుకుమార్‌కు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని, ఆయన సీన్ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. జీనియస్ దర్శకుడు సుకుమార్. నేను పుష్ప-2 షూటింగ్ అయిపోయన తరువాత ఎంతో ఎమోషనల్ అయ్యాను. పుష్ప అనేది ఓ ఎమోషన్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాలు సుకుమార్ ఏది చెబితే అది చేశాం. ఈ సినిమాకు వెచ్చించిన ఐదు సంవత్సరాలు అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. పుష్ప-3 ఏంటో తెలియదు కాదు కానీ ఓ అద్భుతంలా కనిపిస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘మైత్రీ మూవీస్ చెర్రీ సలహాతోనే పుష్పను రెండు భాగాలుగా చేశాను. ఆయన సలహా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాకు ‘రంగస్థలం’ నుంచి ఇప్పటి వరకు వరుస హిట్స్ రావడానికి మైత్రీ మూవీస్ కారణం. ఈ విజయం వాళ్లదే. నాపేరు సుకుమార్ కాదు.. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి లేకుండా నేను సినిమా చేయలేను. భవిష్యత్‌లో కూడా చేయలేను. ఇక అల్లు అర్జున్ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఈ ప్రపంచంలో నన్ను ఓ అద్భుతంలా భావించే వ్యక్తి అల్లు అర్జున్. నన్ను నమ్మే వ్యక్తి. నా దగ్గర సరైన కథ లేకుండా బన్నీ ఓకే అన్నాడు. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ దే‘ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, రవిశంకర్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.