Sunday, January 5, 2025

అల్లు అర్జున్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు భారీ ఊరటను కల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. రెగ్యులర్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అల్లు అర్జున్ బెయిల్ పై న్యాయవాది అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంపై న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని, రూ.50 వేల పూచికత్తుతో ఇద్దరు సాక్షి సంతాలతో కూడిన బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని చెప్పినట్లు వెల్లడించారు. అంతేగాక ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని, కేసు ముగిసే వరకు విచారణకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని కోర్టు సాధారణ షరతులు విధించినట్లు తెలిపారు. ఇక ఈ కేసులో చనిపోయిన రేవతిది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని కోర్టు నిర్ధారించిందని, అందకే బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉందని, దీనిపై ఈ నెల 21న విచారణ జరుగనుందన్నారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేశారు.

బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు
ఫుష్ప2 ప్రీమియర్ సంందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఎ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత అరెస్టు చేశారు. అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన రోజునే హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. రెగ్యు లర్ బెయిల్ కోసం దిగువ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. గత వారం అల్లు అర్జున్ తరపు లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు కూడా పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ పై దాఖలు చేసిన అఫిడవిట్ లో బెయిల్‌ను వ్యతిరేకించలేదు. ఒక వేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ కు బెయిల్ రావడం సులభంగా మారిందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లభించడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది.

ఇక వివాదం సద్దుమణిగినట్లే…!
అల్లు అర్జున్ వ్యవహారం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. సినీ పరిశ్రమను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ వ్యవహారశైలిపైనా విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత సినీ ప్రముఖులంతా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సిఎంను కలవడంతో చాలా వరకూ సమస్యలు పరిష్కారమయ్యాయని భావిస్తున్నారు. సంధ్యా ధియేటర్ తొక్కిసలాటలో నష్టపోయిన కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుంచి భారీ సాయం అందింది. పుష్ప టీం రూ. రెండు కోట్ల వరకూ ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News