పోలీసుల అనుమతితోనే వెళ్లా
తొక్కిసలాటలో ఎవరి వైఫల్యమూ లేదు
అది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన
ఘటన థియేటర్‌కు వెళ్లేముందు ఒక్క
నిమిషం కారు ఆగింది అభిమానులకు
కృతజ్ఞతలు చెప్పి ముందుకు కదిలా
తొక్కిసలాట ఘటన మరునాడు తెలిసింది
నా వ్యక్తిత్వ హననానికి పూనుకోవద్దు
రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నేతలపై నేను
నిందలు వేయడం లేదు మీడియా
సమావేశంలో అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని, ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. “ఇది ఒక ప్రమాదం, ఎవరూ కావాలని చేసింది కాదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. థియేటర్ నాకు గుడిలాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉంది. పుష్ప- 2 సినిమాను ప్రమోట్ చేయడానికి సంధ్య థియేటర్‌కు వెళ్లాము, కానీ అనుకోకుండా తొక్కిసలాట జరిగింది”అని అన్నారు. శనివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ “సంధ్య థియేటర్ ఘటన బాధాకరం. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను థియేటర్ వద్ద ఎలాంటి ర్యాలీ చేయలేదు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకూ నాకు తెలియదు. మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను, నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్లమని చెప్పాను. నేను కూడా ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా. కానీ నాపై కేసు నమోదు చేశారని బన్నీ వాసు చెప్పాడు.
నా లాయర్లు కూడా వద్దని వారించగా, నేను ఆసుపత్రికి వెళ్లలేదు. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, క్షమాపణ తెలియజేస్తున్నా. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. థియేటర్ ఘటనలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు. కొందరు చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి. పుష్ప- 2 సినిమా హిట్టయినా కూడా గత 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నా. నేను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే నా జీవిత ఆశయం. తెలుగువారి ఖ్యాతిని పెంచేందుకు సినిమాలు చేస్తున్నాను. సినిమా థియేటర్లు నాకు దేవాలయంతో సమానం. అలాంటి ఆలయంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే నా కంటే ఎక్కువ బాధపడే వారుండరు. చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై గంటగంటకు సమాచారం తెలుసుకుంటున్నా. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఇప్పుడిప్పుడే కదులుతున్నట్లు వైద్యుల ద్వారా తెలిసింది. ఇంత బాధాకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం కాస్త ఊరట కలిగిస్తోంది”అని అన్నారు. “సంధ్య థియేటర్ ఘటనలో నాపై తప్పుడు, అసత్య ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నేతలు, ఏ ప్రభుత్వ శాఖపై నేను నిందలు వేయడం లేదు. కానీ, తొక్కిసలాట జరిగినప్పుడు నేను తప్పుగా ప్రవర్తించానని అనేక ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నన్ను ఎంతగానో బాధించాయి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత అన్ని సినిమా కార్యక్రమాలను రద్దు చేశాం. ఈ ఘటన విషయంలో బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము. ఇక చిత్ర పరిశ్రమలో 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారు. నాకు మానవత్వం లేదనడం సరికాదు. నా వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలన్నీ వంద శాతం అబద్ధం”అని తెలిపారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మాట్లాడుతూ “ థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఆలోచిస్తూ బాధపడ్డాడు. పలువురు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తామని చెబుతున్నా. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఒక అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని అల్లు అర్జున్ బాధపడుతున్నాడు. మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది”అని అన్నారు.