లేదంటే న్యాయపోరాటమే : టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్
మన తెలంగాణ/హైదరాబాద్ : సినీ హీరో అల్లు అర్జున్ తక్షణమే టిఎస్ఆర్టిసికి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండి సజ్జనార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. అల్లు అర్జున్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇచ్చిన నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు. సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా నటించాలని సూచిం చారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోనికి తీసుకోకుండా వ్యవహరించకూడదని హితబోధ చేశారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చని, కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపర్చకూడదనే విషయాన్ని గుర్తెరగాలని తెలిపారు. ఆర్టిసితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టిసితో ముడిపడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టిసి ప్రతిష్టను పెంచుతామన్నారు.