69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పాన్ ఇండియా సినిమాలు ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’లు సత్తా చాటాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటునిగా అవార్డును గెలుచుకొని రికార్డు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలి తెలుగు కథానాయకునిగా బన్నీ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకొని విజయకేతనం ఎగరేశాడు. టాలీవుడ్‌కు గొప్ప అవార్డును అందించాడు. దీనికి ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు.. దర్శకుడు సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా తోడయిందని చెప్పాలి.
పార్టీ లేదా పుష్ప..
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేనివిధంగా ఊరమాస్ లుక్ లో దర్శనమిచ్చి ప్రేక్షకులు, అభిమానులను అలరించారు. ‘పుష్పరాజ్’ పాత్రలో ‘తగ్గేదేలే’ అనే డైలాగ్‌తో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. ఊ అంటావా మావ…, శ్రీవల్లి…, సామి సామి… పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక పుష్ప సినిమాకు ఉత్తమ నటుడి అవార్డుతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు లభించడం విశేషం. ఇక అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం పట్ల ప్రేక్షకులు, అభిమానులు పుష్పరాజ్ స్టైల్ డైలాగ్‌తో ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
బన్నీ ఇంట్లో సంబరాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారం లభించడంతో.. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహారెడ్డి పాల్గొన్నారు. అల్లు అర్జున్ కేక్ కట్ చేసి గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆనందంతో దర్శకుడు సుకుమార్‌ని కౌగిలించుకున్న బన్నీకి ఆనందభాష్పాలు వచ్చేశా యి. సుకుమార్ కళ్ల నుంచి కూడా ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ అద్భుతమైన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.
జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆరు విభాగాల్లో పురస్కారాలను గెలుపొందడం విశేషం. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాల భైరవ, ఉత్తమ సంగీతం (నేపథ్య) కీరవాణి, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సోలోమన్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్, అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ తెలుగు సినిమాగా ‘ఉప్పెన’ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ గీత రచన విభాగంలో ‘కొండపొలం’ సినిమాకు గానూ చంద్రబోస్ జాతీయ అవార్డును గెలుపొందారు. ఇక ఉత్తమ నటిగా అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతిసనన్ (మిమీ), ఉత్తమ చిత్రంగా రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ), ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (గోదావరి –మరాఠీ), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ), ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్ త్రిపాఠి (మిమి–హిందీ) జాతీయ అవార్డులను గెలుపొందారు.