హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎంసిసిలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, కృష్ణ సోదరుడు- ఆదిశేషగిరి రావు, సినీనటుడు సీనియర్ నటుడు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న రాంజీ గోండ్ మ్యూజియం, విశాఖ లంబసింగిలో కడుతున్న మ్యూజియాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో అల్లూరి మ్యూజియానికి రూ.18 కోట్లు కేటాయించామన్నారు. కృష్ణ మాట్లాడుతూ ‘నా చిన్నతనంలో అగ్గి రాముడు సినిమా చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలిసింది. నటుడు కాక ముందు నుంచి అల్లూరి గురించి బుర్రకథలు రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చాను. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు చదివాను. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా అని ఎదురు చూశా. చివరికి ‘నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎంచుకుని నేనే నిర్మించాను’. నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికి అల్లూరి సీతారామరాజు, ఏడాది పాటు ఆ చిత్రం ప్రేక్షకులను అలరించింది అని కృష్ణ తెలిపారు.