లక్నో : ఉత్తర భారతంలో ఎండదెబ్బలకు వంద మందికిపైగా దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర స్థాయి ఎండలు, వడదెబ్బలతో 72 గంటలలో 54 మంది దుర్మరణం చెందారు. ఉత్తరాదిలో ఇప్పుడు భీకరస్థాయిలో వడగాడ్పులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యుపిలో గత మూడు రోజుల వ్యవధిలో దాదాపు 400 మంది వరకూ ఎండలతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రులలో చికిత్సకు వెళ్లాల్సి వచ్చింది. వృద్ధులు , పిల్లలే కాకుండా యువతరం, ఇంటిపట్టున ఉండే వారు కూడా ఎండదెబ్బలతో సొమ్మసిల్లుతున్నారు. లక్నో, అలహాబాద్ , పలు మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులలో ఇప్పుడు రోగుల తాకిడి ఎక్కువ కావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి రికార్డు అవుతున్నాయి. యుపిలోని బాలియాలో అత్యధికంగా వడదెబ్బల ప్రభావం పడింది. ఈ ఒక్క జిల్లాలోనే వంద మందికిపైగా ఆసుపత్రులలో పడ్డారు. పలువురికి జ్వరాలు, శ్వాసపీల్చుకోలేకపోవడం, ఇబ్బందికరం అవుతోందని జిల్లా వైద్య ప్రధానాధికారి డాక్టర్ జయంత్‌కుమార్ తెలిపారు. అయితే చాలాకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండవేడిమికి గురవుతే వారి పరిస్థితిదిగజారుతోంది. బాలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బాలియాలో ఇప్పటి పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యమంత్రి బ్రజేష్ పాథక్ తెలిపారు.
బీహార్‌లో దాదాపు 50 మంది దుర్మరణం
బీహార్‌లో 24 గంటల వ్యవధిలోనే 44 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. వీరిలో 35 మంది పాట్నాకు చెందిన వారే. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. దీనితో జనం నీడపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మధ్యప్రదేశ్‌లో ఎండలతీవ్రతతో పాఠశాలలకు సెలవులను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు. ఐదవ తరగతి వరకూ విద్యార్థులకు ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే ఆ తరువాతి తరగతుల వారు ఉదయం పూట బడులకు హాజరు కావల్సి ఉంటుంది.