Monday, December 23, 2024

ఒంటరిగానే బరిలోకి… : తమ్మినేని వీరభద్రం

- Advertisement -
- Advertisement -

17 స్థానాలతో తొలిజాబితా
ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత
బిజెపిని ఓడించడమే మా లక్ష్యం
సిపిఐ(ఎం)ను అసెంబ్లీకి పంపండి
రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
సిపిఐ పోటీ చేసే స్థానాల్లో మద్దతిస్తాం : తమ్మినేని

మన తెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే విడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామనీ, దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. 24 సీట్లకు పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయనీ, మొదటి విడతలో 17 స్థానాలను ప్రకటిస్తున్నామని వివరించారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరుగుతున్నదని చెప్పారు.

తనకు ఠాక్రే ఫోన్ చేశారనీ, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగిందన్నారు. ఇక్కడ భట్టి, జాతీయ స్థాయిలో తమ పార్టీ జాతీయ నాయకులతో కెసి వేణుగోపాల్, సోనియా, రాహుల్ గాంధీ చర్చించారని గుర్తు చేశారు. భద్రాచలం, మధిర అడిగితే సిట్టింగ్ స్థానాలు కాబట్టి ఇవ్వలేమంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పారని అన్నారు. భద్రాచలంలో పది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిదిసార్లు సిపిఎం గెలిచిందని చెప్పారు. త్రిపురలో సిపిఎం సిట్టింగ్ సీటును ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కోరితే పొత్తులో భాగంగా కేటాయించామని గుర్తు చేశారు. అయినా సిట్టింగ్ స్థానాల పేరుతో భద్రాచలం, మధిర ఇవ్వలేదన్నారు. పాలేరుపై సానుకూలంగా స్పందించారన్నారు. తర్వాత పాలేరు కుదరదు మిర్యాలగూడ, వైరా ఇస్తామన్నారని చెప్పారు. ఇలా అనేక మెట్లు దిగామన్నారు. ఇప్పుడు వైరా ఇస్తామని అనలేదంటూ భట్టి మాట మార్చారని విమర్శించారు. మిర్యాలగూడతో పాటు హైదరాబాద్‌లో ఒక సీటు ఇస్తామన్నారన్నారు. పొత్తులు పొసిగే పద్ధతి ఇది కాదన్నారు. అవమానకరంగా పొత్తుల కోసం వెళ్లే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేశారు.

మిర్యాలగూడ, వైరా ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంటామనీ, లేదంటే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ నాలుగు రోజుల కింద ప్రకటించామని చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురుచూశామని అన్నారు. అందుకే విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని చెప్పారు. కాంగ్రెస్ అనుసరించిన అపసవ్యమైన విధానమే కారణమన్నారు. అధికారంలోకి వచ్చాక చెరో ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తామంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారని అన్నారు. ప్రధాని పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర సిపిఎంకు ఉందన్నారు. జ్యోతిబసు ప్రధాని అయ్యే వారని చెప్పారు. కమ్యూనిస్టులు ఎలా కనిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు విలువలు, నైతికతను నిలబెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌కు సద్బుద్ధి లేకపోవడం విచారకరమని విమర్శించారు. వామపక్ష శ్రేయోభిలాషులు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
బిజెపి ఒక్క సీటూ గెలవొద్దు
రాష్ట్రంలో బిజెపి ఒక్క సీటునూ గెలవొద్దని తమ్మినేని అన్నారు. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఎక్కడ బలంగా ఉందో నియోజకవర్గాల వారీగా అంచనా వేస్తామన్నారు. బిజెపిని ఓడిరచే పార్టీలను గెలిపించాలని కోరారు. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్, మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీని ఓడిరచడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ను గెలిపించాలనీ, సిపిఐ(ఎం)ను అసెంబ్లీకి పంపాలని కోరారు. అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కమ్యూనిస్టుల్లేని శాసనసభ దేవుడు లేని దేవాలయం లాంటిదని అన్నారు. తాము పోటీ చేయనిచోట వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాట శక్తులను గెలిపించాలని చెప్పారు. ప్రజల పక్షపాతిగా ఉండేవారిని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్‌తో సిపిఐ తెగదెంపులు చేసుకుని వస్తే మంచిదన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తుంటే సిపిఐ పోటీ చేసే చోట తాము పోటీ చేయబోమనీ, ఆ పార్టీకే మద్దతిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన 17 స్థానాల్లోనూ ఒకటి, రెండు మార్పులుండొచ్చని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఓడిరచడమే తమ లక్ష్యం కాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు తమ్మినేని సమాధానమిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీ వేశామనీ, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. బలహీనంగా ఉన్నపుడు పొత్తులు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి తదితరులు పాల్గో న్నారు.
కాంగ్రెస్-కమ్యూనిస్ట్ పొత్తుపై సిపిఐ నారాయణ సెటైర్
వామపక్షాలతో పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాన్చుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటుందే తప్ప. క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీల నేతలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఫైరయ్యారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిశ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి గాని, అబ్బాయిగాని దొరికితే లాగేసుకుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో గానీ, వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాల్లో కూడా అలాగే జరిగితే ఎలా అంటూ సిపిఐ నారాయణ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులకు వామపక్షాలకు ఇస్తామన్న సీట్లను కేటాయిస్తున్నారన్న వార్తలతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ విధంగా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. పొత్తులపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటోందని, నిన్న సిపిఐ, సిపిఎం సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు ఇస్తామని చెప్పిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. మార్పులు ఉంటే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కూడా ఆయన స్పందించారు. తమకు ఇస్తామన్న స్థానాల్లో కొత్తవారికి ఎందుకు చేర్చుకుంటున్నారో తెలియదని కూనంనేని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News