Monday, December 23, 2024

విద్యతో పాటు విద్యార్థులకు క్రమ శిక్షణ అవసరం

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: విద్యతో పాటు విద్యార్థులకు క్రమ శిక్షణ అవసరమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని 1వ వార్డులోని సరస్వతి శిశు మందిర్‌లో రూ. 15 లక్షలతో నూతనంగా నిర్మించే అదనపు తరగతి గదులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగాలలో ఎక్కడ చదివినా విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అవసరమన్నారు.

విద్య విలువ తెలుసు కాబట్టి నియోజకవర్గంలో విద్యాలయాల అభివృద్ధికి సాధ్యమైనంత ఎక్కువగా సహాయం చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో నియో జకవర్గంలో 300 అదనపు తరగతి గదులు, 100 అంగన్‌వాడీ భవనాలు నిర్మిం చామన్నారు. బిసి రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలో మంజూరు అవుతుందన్నారు. బాన్సువాడ పట్టణంలో గత నాలుగు సంవత్సరాలలో అభివృద్ధ్ది, మౌలిక వసతుల కోసం రూ. 650 కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు.

రూ. 4 కోట్లతో పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్ల పార్కు నిర్మిస్తున్నామన్నారు. విత్తనం మంచిదైతే పంట బాగుంటుందని, కల్తీ విత్తనాలు నాటితే పంట దెబ్బతింటుందన్నారు. సమాజానికి మంచి చేసే మనుషులు ఎవరూ, చెడగొట్టే వారు ఎవ్వరు అనేది ప్రజలు గమనించాలన్నారు. మంచితనాన్ని ప్రోత్సహించడానికి అన్ని వేళలా అండగా ఉంటానన్నారు. సమాజంలో మంచి ప్రమాణాలు పెంచే వారు ఎప్పుడు అవసరమన్నారు.

అన్ని మతాలను సమానంగా చూడాలని, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదన్నారు. వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత సంఘటనలు సమాజం, రాజకీయాలను ప్రభావితం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగులగామ వెంకన్న గుప్త, మహ్మద్ ఎజాజ్, పాత బాలకృష్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News