న్యూఢిల్లీ: అభ్యంతరకర ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్‌పై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అదే నేరారోపణపై మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఆయనను బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. పాటియాలా హౌస్ కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు రూ. 20,000 బెయిల్ బాండ్లు డిపాజిట్ చేసిన తర్వాత యుపిలో నమోదు చేసిన అన్ని కేసులలో జుబేర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎఎస్ బొప్పన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా జుబేర్ ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ యుపిలో నమోదైన అన్ని కేసులను కూడా ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం బదిలీ చేసింది. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం జుబేర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తోపాటు ఈ కేసులను కూడా దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. జుబేర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను దర్యాప్తు చేయడానికి యుపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస దర్యాప్తు బృందాన్ని కూడా ధర్మాసనం రద్దు చేసింది.
Alt News founder Zubair gets bail