మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్‌ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste to wealih ) అనే సాంకేతిక ప్రక్రియను అనుసరించడమే మూలకారణం. ఇదే సాంకేతికతను హర్యానా లోని పంట దగ్ధం నుంచి వచ్చే బూడిదకు, వ్యర్థాలకు అన్వయిస్తున్నారు.
పర్యవసానంగా పొరుగునున్న ఢిల్లీ నగరంలో వాయు నాణ్యత మెరుగుపడడానికి దోహదమౌతోంది. భోపాల్ లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ( సిఎస్‌ఐఆర్) అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఎఎంపిఆర్‌ఐ) కి చెందిన పరిశోధకులు పంటలను కాల్చగా వచ్చిన బూడిద, వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలమైన, సంకర కలపగా మార్చ గలుగుతున్నారు.
ఈ విధంగా తయారైన కలప, సంప్రదాయ కలప, ప్లైవుడ్ కన్నా దృఢత్వంతో ఉండడమే కాక, వాటి ధరలతో పోలిస్తే 30 శాతం తక్కువ ధరతో అందుబాటు లోకి వస్తోంది. పంటల వ్యర్ధాలతో తయారయ్యే సంకర కలప, ప్లైవుడ్ ఇళ్ల పైకప్పుల షీట్లకు, తలుపులు, గోడల తయారీకి ఉపయోగపడుతోంది. రెండేళ్లలోనే అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీ హర్యానా ప్రభుత్వానికి ఇప్పటికే బదిలీ అయింది. సిఎన్‌ఐఆర్, ఎఎంపిఆర్‌ఐ పరిశోధకుల సూచనల ప్రకారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ ఎం ఇ) రంగం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి హర్యానాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ లోని రాయిపూర్ కంపెనీకి కూడాఈ టెక్నాలజీ బదిలీ అయింది.
అక్కడ భారీ స్థాయిలో హరిత సంకర కలపను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఉత్తరాదిలోని పొలాల్లో రైతులు పంటలను మండించడం వల్ల వస్తున్న సమస్యలు పరిష్కారం కావడమే కాక, పర్యవసానంగా ఢిల్లీ నగర వాయు నాణ్యత చాలావరకు మెరుగవుతుంది. అంతేకాదు కలప కోసం చెట్లను కూల్చివేయడం బాగా తగ్గుతుంది. గ్రీన్‌వుడ్ టెక్నాలజీపై పరిశోధనలు 2010 లో ప్రారంభమై దశాబ్ద కాలంగా దినదిన ప్రవర్థమానమయ్యాయి. ఫలించడంతో ఫ్లైయాష్ నుంచి ప్రత్యామ్నాయ కలప తయారవ్వడం విశేషం. మహారాష్ట్ర లోని చంద్రాపూర్ లోని ప్రైవేట్ యూనిట్ కూడా వాణిజ్యం కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది. పశ్చిమబెంగాల్ గోగునార విషయంలో ఈ టెక్నాలజీపై 2020లోనే ఆసక్తి చూపించింది.