Monday, December 23, 2024

వీరులారా ‘వన్‌’దనం

- Advertisement -
- Advertisement -

Amar Jawan Jyoti merged with National War Memorial

జాతీయ యుద్ధ స్మారకంతో అమరజవాన్ జ్యోతి విలీనం
ఢిల్లీలో చారిత్రక ఘట్టం ఆవిష్కరణ
50 ఏళ్లు నిర్విరామంగా జ్వలించిన అమరజవాన్ జ్యోతికి స్థాన చలనం
సైనిక లాంఛనాల నడుమ కార్యక్రమం

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతికి స్థానచలనం కలిగింది. ఈ జ్యోతిని అమర్ జవాన్ల స్మారకానికి 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం( నేషనల్ వార్ మెమోరియల్) వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేశారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ పర్యవేక్షణలో మధ్యాహ్నం 3.30 గంటలకు సైనిక లాంఛనాల నడుమ ఈ కార్యక్రమం పూర్తయింది. తొలుత ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక కాగడాతో అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్దకు తీసుకెళ్లారు.అక్కడి జ్వాలతో ఈ జ్యోతినివిలీనం చేశారు. అమర్ జవాన్ జ్యోతి గురించి గురువారంనుంచి అనేక కథనాలు వచ్చాయి.

తొలుత ఈ జ్యోతిని పూర్తిగా ఆర్పేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం జ్యోతిని ఆర్పేయటం లేదని స్పష్టం చేసింది. అమర్ జవాన్ జ్వాలను తీసుకెళ్లి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఉన్న జ్యోతిలో కలుపుతున్నట్ల్లు వెల్లడించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న స్మారకం వద్ద అమర జవాన్ల పేర్లు లేనందున అక్కడ జ్యోతి వెలుగుతుండడం వారికిచ్చే నిజమైన నివాళి అనిపించుకోదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారని, అక్కడే జ్యోతి కూడా వెలిగితే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లవుతుందని తెలిపింది.

1971లో భారత్‌పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద స్మారకం నిర్మించారు.1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. అయితే ఆ తర్వాత దేశ రాజధానిలో రూ.140 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ ఫలకాలపై లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాతనుంచి ఇండియా గేట్ వద్ద జరిగే అన్ని కార్యక్రమాలను జాతీయ యుద్ధ ప్మారకం వద్దకు మార్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News