కాంగ్రెస్ పంజాబ్ ఇంచార్జ్ హరీష్‌రావత్
న్యూఢిల్లీ: 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్‌రావత్ తెలిపారు. కెప్టెన్ నాయకత్వం పట్ల ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకున్నదన్న వార్తల నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్‌ను తొలగించాలన్న డిమాండ్‌కు పలువురు ఎంఎల్‌ఎలు, కొందరు మంత్రులు మద్దతు తెలిపారన్న కథనాలు వెల్లడయ్యాయి. మంగళవారం 23మంది ఎంఎల్‌ఎలు, నలుగురు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సమావేశం అనంతరం మంత్రి త్రిప్త్ రాజీందర్‌సింగ్‌బజ్వా దీనిపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కెప్టెన్‌ను మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్తామన్నారు. బుధవారం ఆ నలుగురు మంత్రులు రావత్‌తో సమావేశమై చర్చించారు. రావత్‌తో సమావేశం అనంతరం కూడా వారు తమ ఆలోచన మార్చుకోలేదని తెలుస్తోంది. సోనియా దగ్గరికి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు.