Wednesday, January 22, 2025

రెండో రోజు నిలిచిన అమర్‌నాథ్ యాత్ర

- Advertisement -
- Advertisement -

జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మంచుచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్ యాత్రలో రెండోరోజు కూడా అంతరాయం ఏర్పడింది. దీనితో యాత్రికులు జమ్మూ బేస్‌క్యాంప్‌లో ఉండిపోవల్సి వచ్చింది. శనివారం కూడా యాత్రికులను ఇక్కడి భగవతినగర్ బేస్‌క్యాంప్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అమర్‌నాథ్ యాత్రకు వస్తుంటారు. వాతావరణం అనుకూలించకపోవడంతో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని రాకపోకలకు మూసివేశారు. దీనితో బేస్‌క్యాంప్ నుంచి యాత్రికుల బృందాలను ఇప్పుడు జమ్మూకే పరిమితం చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తేనే వీరిని యాత్రకు అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

భారీ వర్షాలతో బురద కొండచరియలు విరిగిపడటంతో హైవేపై రాంబణ్ వద్ద తెల్లవారు జామున క్లిష్టపరిస్థితి ఏర్పడింది. దీనితో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాలల్లో నెలకొని ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహకు యాత్రికులను జులై 1 నుంచి అనుమతించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ 80000 మందికిపైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి పూజాదికాలు నిర్వహించి వెళ్లారు. తొలుత శుక్రవారం యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. భారీ వర్షాలతో ఈ చర్య తీసుకున్నారు. రెండు మార్గాలు అయితే సాంప్రదాయక 48 కిలోమీటర్ల ఫల్గామ్ రాదారి , 14 కిలోమీటర్ల దూరపు బల్టాల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

పంచతర్ణి ప్రాంతంలో 200 మంది తెలుగు వారు
మంచుచరియలు విరిగి పడ్డ బేస్‌క్యాంప్ వద్దనే నిలిచిన దాదాపు 1500 మంది అమర్‌నాథ్ యాత్రికులలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు 200 మంది ఇక్కడ గడపాల్సి వచ్చింది. తమ వారి క్షేమసమాచారాల కోసం ఆయా రాష్ట్రాల వారు నానా పాట్లు పడుతున్నారు. ఇక్కడి సహాయక తాత్కాలిక శిబిరాలలో యాత్రికులకు వసతి కల్పించారని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. హిమాలయాల్లో 3888 మీటర్ల ఎత్తున ఉండే మంచుశివలింగాన్ని సంవత్సరంలో ఒక్కసారే సందర్శించుకునే వీలుంటుంది. ఆగస్టు 21వ తేదీవరకూ యాత్రసాగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News