4,026 మంది యాత్రికులు పయనం
జమ్మూ: అననుకూల వాతావరణం కారణంగా ఆదివారం రద్దయిన అమర్‌నాథ్ యాత్రను అధికారులు సోమవారం పునరుద్ధరించారు. 4,026 యాత్రికులతో 12వ బ్యాచ్ ఇక్కడి భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాలతో భారీ సిఆర్‌పిఎఫ్ భద్రత మధ్య దక్షిణ కశ్మీరు హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తయిన గుహలో వెలసిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వీరంతా మంగళవారం ఉదయం అమర్‌నాథ్ చేరుకుంటారని వారు చెప్పారు. వీరిలో 3,192 పురుషులు, 644 మంది మహిళలు, 13 మంది పిల్లలు, 174 మంది సాధువులు, ఆరుగురు సాధ్విలు ఉన్నారని వారు చెప్పారు. వాతావరణం అనుకూలాంగా లేకపోవడంతో జమ్మూలోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ఆదివారం అమర్‌నాథ్ యాత్రకు అధికారులు అనుమతించలేదు. భారీ వర్షాల కారణంగా జులై 8వ తేదీన అమర్‌నాథ్ సమీపంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 16 మంది యాత్రికులు మరణించగా మరో 30 మంది గల్లంతయ్యారు. ఇలా ఉండగా..ఆకస్మిక వరదల కారణంగా అమర్‌నాథ్‌కు గుహ వద్దకు వెళ్లే దారి కొట్టుకుపోవడంతో అధికారుల గుహ వెలుపల తాత్కాలిక మెట్లను అమర్చారు.