అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 6వ తేదీ శనివారం గుహ మందిరానికి రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుండి బాల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్తగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు 1.50 లక్షలకు పైగా భక్తులు..3,800 మీటర్ల ఎత్తైన గుహ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్నారు. అనంత్‌నాగ్‌లోని నున్వాన్-పహల్గాం మార్గం, గందర్‌బాల్‌లో బల్తాల్ మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. కాగా, గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు గుహ మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.
యాత్ర కొనసాగే ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోయినా.. అమర్‌నాథ్ పవిత్ర గుహకు వెళ్లే కొన్ని ప్రదేశాలలో జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అమర్‌నాథ్ పవిత్ర స్థలంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 15°C వరకు ఉంటాయని.. అయితే రాత్రి సమయంలో ఈ ఉష్ణోగ్రతలు 5°Cకి తగ్గవచ్చని అంచనా వేసింది. చందన్వారి, బాల్తాల్ వద్ద ఉష్ణోగ్రతలు గరిష్టంగా 24-25°C వరకు ఉండవచ్చని… రాత్రి ఉష్ణోగ్రతలు 12°C వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.