మరో వారం రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి అన్ని చర్యలను చేపట్టినట్లు జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆనంద్ జైన్ యాత్రను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను భగ్నం చేయడానికి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పోలీసు అధికారులకు సూచించినట్లు శనివారం అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి సూచికగా శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం
జరిగిన ప్రథమ్ పూజలో పాల్గొన్న సిన్హా మాట్లాడుతూ జూన్ 29 నుంచి దేశవ్యాప్తంగా భక్తులకు అమర్‌నాథ్ మంచు లింగ దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రికుల కోసం శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. గడచిన రెండేళ్లలో యాత్రికులకు సౌకర్యాలు చాలా మెరుగుపడినట్లు ఆయన చెప్పారు. మంచు లింగం ఉండే గుహతో వెళే రహదారులను మెరుగుపరిచినట్లు ఆయన చెప్పారు. కొన్ని ఇరుకు మార్గాలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్‌ఓ) ఈ ఏడాది వెడల్పు చేసినట్లు సిన్హా తెలిపారు. ఈసారి యాత్రికులు మరింత సులభంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. అన్ని మతాలకు చెందిన ప్రజలు అమర్‌నాథ్ యాత్రను బలపరుస్తున్నారని ఆయన అన్నారు.