కోల్‌కతా: నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన ఆర్థికశాస్త్రవేత్త అమర్త్య సేన్ పశ్చిమబెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆయనకు, విశ్వభారతి యూనివర్శిటీ అధికారులకు మధ్య 13 డెసిమల్స్ భూమి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో సదరు భూమిని ఖాళీ చేయాలని నోటీసులు అమర్త్య సేన్‌కు ఇచ్చారు. జిల్లాలోని బోల్‌పూర్ శాంతినికేతన్ వద్ద యూనివర్శిటీ క్యాంపస్‌లో భూమిని అక్రమంగా ఆక్రమించారని అమర్త సేన్‌పై యూనివర్శిటీ అధికారులు నిందిస్తున్నారు.
అమర్త్య సేన్‌కు మే 6 కల్లా ఖాళీ చేయమన్న నోటీసును ఏప్రిల్ 20న ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. కాగా అమర్త్య సేన్ తరఫు న్యాయవాది గోరాచంద్ చక్రబర్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఖాళీ చేయమన్న నోటీసుకు వ్యతిరేకంగా బీర్‌భూమ్ జిల్లాలోని సురి జిల్లా కోర్టులో అప్పీల్‌ను ఇప్పటికే దాఖలు చేశామని అన్నారు. ఈ కేసు తొలి విచారణ మే 15న జరుగనున్నది.