మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ‘దేశ పతనం‘ అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. కోల్‌కతాలో సాల్ట్ లేక్ ప్రాంతంలో అమర్త్యసేన్ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో తాను చూసిన విభజనలే తనను చాలా భయపెట్టాయని అన్నారు. ప్రజలను కటకటాల వెనక్కి నెట్టడానికి వలసరాజ్యాల చట్టాలను ఉపయోగించడం అసాధారణమైనదని అన్నారు. గుజరాత్ పోలీసులు ఇటీవల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటన్నింటిని ఎదుర్కోవడానికి కేవలం సహనం సరిపోదని అన్నారు. దేశంలో సహనశీలత స్వాభావిక సంస్కృతి ఉందని, హిందువులు, ముస్లింలు కలిసి పనిచేయడం ప్రస్తుత అవసరం‘ అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు.
భారత్ హిందూ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే దేశంతో పాటు ముస్లిం సంస్కృతి కూడా ఇందులో భాగమేనని అన్నారు. ‘యూదులు, క్రైస్తవులు, పార్సీలు వేల సంవత్సరాలు ఇక్కడే జీవించారని ప్రస్తావించారు.‘భారత న్యాయవ్యవస్థ తరచుగా విభజన ప్రమాదాలను విస్మరిస్తుంది, ఇది భయానకంగా ఉంటుంది. సురక్షితమైన భవిష్యత్తు కోసం, దేశంలో న్యాయవ్యవస్థ, శాసన, బ్యూరోక్రసీ మధ్య సమతుల్యత ఉండాలన్నారు. కాగా వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చే సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉదయ్‌పూర్‌లో దర్జీ తల నరికి చంపిన రెండు రోజుల తర్వాత అమర్త్యసేన్ వ్యాఖ్యలను చర్చకు దారితీశాయి.