మనతెలంగాణ/హైదరాబాద్ : టీకాల మేళవింపు కొవిడ్ వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ కల్పించటమే కాక, సురక్షితమైన ప్రక్రియ అని ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్ వ్యాక్సిన్లు రెండూ డోసులు తీసుకున్న వారిలో వైరస్ స్పైక్ ప్రొటీన్లను తటస్థీకరించే సామర్థ్యం 4 రెట్లు పెరిగిందని తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఏఐజీ వెల్లడించింది. అధ్యయనం ద్వారా గుర్తించిన అంశాలను 60 రోజుల పాటు పరిశీలించి అధ్యయన ఫలితాలను ఏఐజీ ప్రకటించింది. ఈ సందర్భంగా అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. 330 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లను నాలుగు గ్రూపులుగా చేసి వారిపై అధ్యయనం నిర్వహించామని తెలిపారు.
కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిని ఒక గ్రూపులో, కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారిని మరో గ్రూపులో, రెండు రకాల డోసులు తీసుకున్నవారిని మూడు, నాలుగు గ్రూపులుగా తీసుకొని అధ్యయనం చేశామని చెప్పారు. టీకాల మేళవింపు.. శరీరంలో యాంటీబాడీల ప్రతిస్పందనను పెంపొందించటమే కాక, సురక్షితమైన ప్రక్రియగా అధ్యయనంలో తేలిందని అన్నారు. రెండు వేరువేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో స్పైక్ ప్రొటీన్ ప్రతిరోధకాల ప్రతిస్పందన నాలుగు రెట్లుగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. తద్వారా ఈ రకమైన ప్రక్రియ ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లపై మెరుగైన ప్రభావాన్ని చూపించేందుకు అవకాశం ఉందని తెలిపారు. జనవరి 10 నుంచి ఇచ్చే బూస్టర్ డోస్ ప్రక్రియలో ఈ అధ్యయనాన్ని ఒక సూచనగా పరిగణించాలని ఐసీఎంఆర్‌ను కోరామని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు.