న్యూయార్క్: ప్రముఖ ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సాలో వందలాది బంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధ(ఎఐ)పై ఆ సంస్థ దృష్టిపెట్టిన నేపథ్యంలో ఈ తొలగింపులు చేపట్టడం గమనార్హం.ఈ మేరకు అలెక్సా,ఫైర్ టీవీ విభాగాల వైస్‌ప్రెసిడెంట్ డేనియల్ రౌస్ ఉద్యోగులకు లేఖ రాశారు. మారుతున్న వ్యాపార ప్రాధాన్యతల్లో మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నంలో కొన్నింటిలో మార్పులు చేపడుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్పాదకత పెంచడం, ఎఐపై దృష్టిసారించడం వంటివి అందులో ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ‘వందలాది’ ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు రౌశ్ తన లేఖలో పేర్కొన్నారు.
అయితే ఎంతమందిని తొలగిస్తున్నదీ స్పష్టంగా తెలియజేయలేదు. అమెజాన్ తాజా నిర్ణయంతో అమెరికా, కెనడా, భారత్‌లలోని ఉద్యోగులపై ప్రభావం పడనుంది. పెద్ద కంపెనీలు ఎఐ టూల్స్‌పై ఆదారపడడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఎఐ ద్వారా తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆ సంస్థలు అడుగులు వేస్తున్నాయి.అమెజాన్ సైతం గత కొన్ని నెలలుగా ఎఐని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా నే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలెక్సాలో జనరేటివ్ ఎఐఆదారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. మరోవైపు ఇప్పటికే అమెజాన్ సంస్థ గత ఏడాది చివర్లో, ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది.గేమింగ్, మ్యూజిక్ విభాగాల్లోను ఇటీవల కొన్ని కొలువులను తొలగించింది. ఇప్పుడు అలెక్సా కూడా ఆ జాబితాలో చేరింది.