Sunday, January 19, 2025

డేటా హబ్‌లో ‘హై’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. నగరంలో మరో అతిపెద్ద కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో తన రెండో మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఆసియా పసిఫిక్ రీజియన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. డెవలపర్లు, వ్యవస్థాపకులు, సంస్థలు, ప్రభుత్వం డాటా సెంటర్ల నుంచి తమ అప్లికేషన్లను అమలు చేసేందుకు, వినియోగదారులకు సేవలు అందించే సదుపాయం ప్రారంభమైనట్లు పేర్కొంది.

డాటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఆవిష్కరణలకు ఊతమిస్తూ వినియోగదారుల సేవల కోసం అధునాతన సాంకేతికలను ఉపయోగించనున్నారు. హైదరాబాద్‌లో డాటా కేంద్రం ఏర్పాటు కోసం భారీ పెట్టుబడి పెడుతున్నట్లు 2020 నవంబర్ 6న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. డాటా కేంద్రాల ఏర్పాటు కోసం 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు అప్పట్లో అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

48 వేల మందికిపైగా ఉపాధి

అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఏడాదికి సుమారు 48 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2030 వరకు హైదరాబాద్ కేంద్రంపై రూ.36,300 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో ఉన్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. భారతదేశంలో రెండో ఇన్‌ఫ్రా కేంద్రంగా నగర శివారు మహేశ్వరంలోని ఆసియా పసిఫిక్ రీజియన్‌కు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. దాంతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఈ- గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక రంగాల్లో మెరుగైన సేవలు, కార్యకలాపాల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు అందించనుంది.

తెలంగాణ స్థానం బలోపేతం
హైదరాబాద్‌లో ప్రారంభించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఎడబ్లూఎస్) సెంటర్‌ను రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో దేశంలోనే ప్రగతిశీల డాటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని కెటిఆర్ తెలిపారు. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ సెంటర్ను ప్రారంభించినట్లు అమెజాన్ ఆసియా ఫసిఫిక్ రీజియన్ ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ కొత్త సెంటర్ 2030 నాటికి సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడుటు పెట్టనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఈ పెట్టుబడులతో సంవత్సరానికి సగటును 48 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News