న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోన్న భద్రతను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఈ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంబానీ ఆయన కుటుంబానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై త్రిపుర హైకోర్టు వెలువరించిన ఆదేశాలను కొట్టివేస్తూ ఈ కేసును తదుపరి విచారించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన ధర్మాసనం తెలిపింది. ముంబైలో అంబానీ కుటుంబానికి కల్పించిన జడ్ ప్లస్, వై ప్లస్ సెక్యూరిటీ ఏర్పాట్లు దేశ రాష్ట్రపతి, ప్రధాని, అతి కొందరు ప్రముఖులకు కల్పించే భద్రతా ఏర్పాటుగా ఉంది. అయితే ఈ సెక్యూరిటీకి అయ్యే ఖర్చును అంబానీ కుటుంబం భరిస్తోంది. కేంద్రం తరఫున హాజరయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలో త్రిపురకు చెందిన పిటిషనర్ బికాష్ సాహాకు ముంబైలోని వారికి కల్పించిన భద్రతపై సవాలు అవసరం ఏమిటని, పైగా ఈ పిటిషన్‌ను త్రిపుర హైకోర్టు విచారణకు స్వీకరించి వివరణకు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు.